విషాదం.. కరోనాతో యువ సర్పంచ్ మృతి

by Sridhar Babu |
విషాదం.. కరోనాతో యువ సర్పంచ్ మృతి
X

దిశ, సిరిసిల్ల : కరోనా కాటుకు ఓ యువ సర్పంచ్ బలయ్యాడు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామ సర్పంచ్ సుదర్శన్ (33) కొవిడ్ బారినపడి ఆదివారం మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఇటీవల ఆయనకు కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పేద కుటుంబానికి చెందిన సర్పంచ్ సుదర్శన్ పరిస్థితిని స్థానిక లీడర్లు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

కాగా అతని వైద్య ఖర్చులు తాము భరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పిన్న వయస్సులోనే సర్పంచ్‌గా ఎన్నికైన సుదర్శన్ గ్రామంలో పారదర్శక సేవలు అందిస్తూ మండలంలోనే ఆదర్శ సర్పంచ్‌గా అందరి మన్ననలు పొందారు. అంతలోనే కరోనా సోకి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుదర్శన్ మృతికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మండల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story