- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విషపూరిత బంధాలకు ‘బ్రేక్’.. అలాంటి స్నేహాలకు వీడ్కోలే బెస్ట్ !
దిశ, ఫీచర్స్ : మనుషులు మానసికంగా, శారీరకంగా ఒకరికొకరు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. ప్రతీవిషయంలో ఓ తోడు కోరుకుంటూ వారితో కష్టసుఖాలు పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బంధాలు సంతోషంగా నిలబడాలంటే మానవ ప్రయత్నం అవసరం. సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మన విషయంలో పరిపూర్ణంగా లేరని ఒకానొక సమయంలో భావించొచ్చు. కానీ మరో కోణం నుంచి చూస్తే వారి స్వభావాలు, తప్పులు, మనోభావాలకు మనం ఎలా స్పందిస్తున్నామన్నదీ ముఖ్యమే. ప్రతీ బంధంతో అనుకూలతలున్నట్లే, సవాళ్లు ఉంటాయన్నది కూడా వాస్తవం. చిన్న చిన్న విషయాల్లో హెచ్చుతగ్గులు, కొన్ని అభిప్రాయ బేధాలుండటం సర్వసాధారణమైనా కొన్నిసార్లు సంబంధాలు ఒకరు ఊహించిన దాని కంటే మెరుగ్గా మారితే, మరికొన్నిసార్లు అవి విషపూరితంగా మారతాయి. ఇది ప్రధానంగా భార్యాభర్తలు గుర్తించాల్సిన విషయం. వారి అనుబంధం టాక్సిక్‌గా మారితే బంధం బీటలు వారడమే కాదు.. ఒకరి ఆత్మగౌరవాన్ని, ఆనందాన్ని నాశనం చేయొచ్చు, చివరికి జీవితమే అగాథంగా మారిపోవచ్చు. మరి మిగతా బంధాలు ‘టాక్సిక్’గా ఎలా మారతాయి? ఆ సమయంలో మనం ఏం చేయాలి?
భార్యాభర్తల బంధంలో ఎవరూ ఎక్కువతక్కువ కాదు. ఒకరి విజయంలో మరొకరి భాగం తప్పకుండా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో, స్వేచ్ఛగా జీవించడంలో, నమ్మకంగా ఉండటంలో ఇరువురు ఒకరికొకరు ఆదర్శంగా ఉంటూ ఎదుగుదలకు తోడ్పడాలి. అలా కాకుండా ఒకరి కదలికను మరొకరు నియంత్రిస్తున్నట్లు అనిపిస్తే ఎక్కడో తేడా కొట్టినట్లే. ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి దూరం చేస్తున్నట్లనిపిస్తే, అది కచ్చితంగా టాక్సిక్ రిలేషన్‌షిప్‌నకు సంకేతంగా భావించాలి. జీవిత భాగస్వామికి జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కానీ జీవితమంతా కాదన్నది సత్యం. మనసుకు నచ్చిన, ఇష్టపడిన విషయాల నుంచి దూరంగా ఉంచుతున్నట్లయితే, అది పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని గ్రహించాలి. ఆ దశకు చేరుకున్నామంటే తిరిగి ఆరోగ్యకరమైన బంధంలోకి రావడం మరింత కష్టమవుతుంది. ఒకవేళ తమ అనుబంధం విషపూరితంగా మారుతుందని పార్ట్‌నర్స్‌లో ఎవరో ఒకరు గుర్తించినా.. వెంటనే భాగస్వామితో లేదా మీ జీవితానికి సానుకూలంగా దోహదపడే వారితో మాట్లాడాలి. పరిస్థితిని అర్థం చేసుకుని, సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
వాదన తగదు..
విషపూరిత వ్యక్తులు వాదన పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మానసికంగా దృఢంగా ఉంటూ ఆర్గ్యుమెంట్ జోలికి పోకుండా కామ్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. నెమ్మదిగా భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. అవసరమైతే, ఎమోషన్స్ ప్రాసెస్ చేయడంలో నిపుణుల సాయం తీసుకోవాలి. ఎంత ఎక్కువ వివరించడానికి ప్రయత్నిస్తే అక్కడ అంతగా డ్రామా చోటుచేసుకుని బంధం మరింత గాఢత కోల్పోయే ప్రమాదం ఉంది.
మార్చవద్దు..
తరచుగా వ్యక్తుల నుంచి అననుకూల ప్రవర్తన అనుభవించినప్పుడు.. వెంటనే వారిని మార్చడానికి ప్రయత్నిస్తాం. కానీ విషపూరితమైన వ్యక్తులను మార్చడం అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ మనకు మనం చేసుకునే గొప్ప సాయం ఏంటంటే.. స్వస్థపరుచుకోవడం(హీలింగ్), దాని తాలుకు బాధను విడిచిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే అది చర్యకు స్పందించే దృక్పథాన్ని మార్చుకునేందుకు సాయపడుతుంది. మనసును తేలిక పరుస్తుంది.
ఫోకస్ ఆన్ యువర్ ఓన్ జర్నీ..
కష్టమైన సంబంధాలు మనకు నేర్పే అతి పెద్ద పాఠాల్లో ఒకటి.. ‘మనల్ని మనం వెతుక్కోవడం’, ‘మనతో మన సంబంధాన్ని పెంచుకోవడం’. ఇష్టమైన పనులు చేస్తూ మనదైన ప్రపంచంలో బతకడం వల్ల కోల్పోయిన ఆనందాల్ని తిరిగి పొందొచ్చు. మన దారిలో స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ప్రయాణించడం మొదలుపెడితే ఆనందం కూడా సొంతమవుతుంది.
వర్క్‌ప్లేస్‌లో :
ఎవరితో పని చేస్తామన్నది మన చాయిస్ కాదు. మన జీవితంలో ఏదో ఒక దశలో.. విరుద్ధ భావాలతో పనిచేసే వ్యక్తులతో కలిసి పనిచేయొచ్చు లేదా ఒకే వేవ్‌లెంగ్త్ ఉన్న కొలిగ్స్‌తోనూ వర్క్ షేర్ చేసుకోవచ్చు. కానీ కాలక్రమేణా మనం విషపూరిత కార్యాలయ వాతావరణంలో చిక్కుకున్నప్పుడు నిస్సహయంగా మారిపోతాం, ఆందోళన స్థాయిలు పెరగవచ్చు. అక్కడి ప్రభావం వల్ల ఇంటి జీవితంలో కలతలు రావొచ్చు. నిద్రాభంగం ఏర్పడొచ్చు. ఆరోగ్యం పాడైపోయే అవకాశం లేకపోలేదు. అందువల్ల బెదిరింపు, గాసిప్స్, పాసివ్-అగ్రెసివ్ కమ్యూనికేషన్, అన్‌ఫెయిర్ అండ్ అన్ ఈక్వల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పాలసీస్, నార్సిసిస్టిక్ లీడర్‌షిప్, అన్‌మోటివేషనల్ కో వర్కర్స్ వంటి విషయాలన్నీ టాక్సిక్ వర్క్ ప్లేస్ ఎదుర్కుంటున్నారనడానికి మార్గాలు. ఇలాంటి వాతావరణంలో పని చేయడం వల్ల మీకు మీరుగా కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. దీన్నుంచి బయటపడటానికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం ఉత్తమం.
విషపూరిత స్నేహం?
‘టాక్సిక్ ఫ్రెండ్‌షిప్’ చాలా మంది జీవితాల్లో ప్రధాన సమస్యగా ఉంది. కెరీర్‌లో ఉన్నతదశకు చేరినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా, అందమైన సెలవుదినం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా, హెల్తీ చేంజెస్ చేసే ప్రయత్నంలో ఉన్నా, అద్భుతంగా కనిపించినా లేదా కొత్త రిలేషన్‌షిప్ మొదలుపెట్టినా కొందరు స్నేహితులు కిందకు దించడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదుస్నేహితుడి మద్ధతు కావాల్సినప్పుడు లేదా మిత్రుడు అవసరం ఉన్నప్పుడే పక్కన ఉండరు. ముఖ్యమైన విషయాల్లోనూ అనవసరమైన ఒత్తిడి లేదా ఆందోళన పెంచేలా మాట్లాడుతుంటారు. అతిగా అసూయ పడటమే కాకుండా, రెండు నాలుకల ధోరణి అవలంబిస్తారు. ఈ సంకేతాలు సూక్ష్మంగా ఉంటాయి. ముందుగానే గుర్తించకపోతే ఎక్కువగా నష్టపోతుంటాం. స్నేహితుడు సాయం చేయడం కంటే మానసికంగా హాని కలిగిస్తున్నట్లు అనిపించినప్పుడు, మీ గురించి మంచిగా చెప్పకపోయినా చెడు ప్రచారం చేస్తున్నాడని తెలిసినప్పుడు నిరభ్యంతరంగా వీడ్కోలు పలకడమే ది బెస్ట్ డెసిషన్.
ఏ బంధంలో బీటలు వారినా మిమ్మల్ని మీరు బ్యాక్ అప్ చేసుకోండి. ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్లండి, సంబంధం ముగిసిందని అంగీకరించండి. అందుకోసం మిమ్మల్ని మీరు నిందించవద్దు. జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టండి. నయం కావడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. కొత్త హాబీలను అలవర్చుకోవాలి. సంబంధాన్ని ముగించడానికి, దూరంగా ఉండటం ద్వారా స్వీయ గౌరవాన్ని కాపాడుకోవడానికి తగినంత బలంగా ఉన్నందుకు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి.
– శ్రావణ్ కుమార్ పత్తిపాక