- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Manipur: మణిపూర్‌లో ఆగని హింస.. చురాచంద్‌పూర్‌లో ఒకరు మృతి

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో అల్లర్లు చల్లారడం లేదు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నిరంతరం ఉద్రిక్తపరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా బుధవారం చురాచంద్‌పూర్ (Churachandpur)లో హ్మర్, జోమి తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. జోమి వర్గం తమ కమ్యూనిటీ జెండాను ఎగురవేయడాన్ని హ్మర్ గ్రూపులు వ్యతిరేకించడంతో హింస నెలకొన్నట్టు పోలీసులు తెలిపారు. ఆగ్రహానికి గురైన ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగినట్టు వెల్లడించారు. ఘర్షణ వివరాలు తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు జనాన్ని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించాయి. మృతి చెందిన వ్యక్తిని హ్మార్ తెగకు చెందిన లాల్రోపుయ్ పఖుమతే (53) గా గుర్తించారు. అంతకుమందు ఆదివారం జెన్‌హాంగ్‌లో హ్మార్ ఇన్‌పుయ్ ప్రధాన కార్యదర్శి రిచర్డ్ హ్మార్‌పై జరిగిన దాడి తర్వాత చురాచంద్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. ఇది రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
కాగా, మే 2023 నుంచి మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య జాతి హింస నెలకొంది. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ఘటనల్లో ఇప్పటి వరకు 250 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హింస ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 13న సీఎం బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయినప్పటికీ హింస కొనసాగుతూనే ఉంది.