అనుమానం నిజమే.. అందుకే ఉద్యోగాలు!

by Anukaran |   ( Updated:2020-12-13 12:23:28.0  )
అనుమానం నిజమే.. అందుకే ఉద్యోగాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్‌దే. అభివృద్ధి అంటే మాదే.. అంటూ జబ్బలు చరుసుకున్న ఆ పార్టీ.. రాబోయే ఎన్నికలను చేసి భయపడుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014 నుంచి అప్రతిహతంగా విజయబావుట ఎగురవేసిన గులాబీ పార్టీకి నాలుగేండ్ల క్రితం ఉన్న అనుకూల పరిస్థితులు నేడు కనిపించడం లేదు. పార్టీలో అత్యంత విజయవంతమైన నాయకుడైన హరీశ్ రావుకు ఆయన గడ్డ దుబ్బాకలోనే ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్‌ను మూడు, టీఆర్ఎస్‌ను రెండో స్థానానికి నెట్టి బీజేపీ విజయం సాధించింది. అది చాలదన్నట్లు జీహెచ్ఎంసీలోనే కారుకు కమలం బ్రేకులు వేయడంతో ఇప్పుడు ఎన్నికలంటేనే టీఆర్ఎస్ జంకుతున్నట్లు స్పష్టమవుతోంది.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేది ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీంతో వరస విజయాలతో జోష్ మీదున్న బీజేపీ నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ఆలోచనలో పడ్డారు. ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే రెండు సార్లు విఫలం అయిన టీఆర్ఎస్ వ్యూహాన్ని మూడోసారి రిపీట్ కాకుండా చూసేందుకు కసరత్తులు ప్రారంభించారు. నాగార్జున సాగర్ ఎన్నికల ముందే జరుగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ఒకేసారి 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉపాధ్యాయ, పోలీస్‌ శాఖలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలని, లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అయితే.. ఎన్నో ఆందోళనలు, మరెన్నో నిరాహార దీక్షలు, రోడ్లపైకి ఫ్లకార్డులతో వచ్చి నిరసనలు చేస్తే గానీ ఉద్యోగాల మాటెత్తని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నపలంగా ఆదివారం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ప్రకటించడంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు నాగార్జున సాగర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రిపీట్ కాకుండా చూడాలని కేసీఆర్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారని చర్చలు నడుస్తున్నాయి. మరి దీనిని ప్రజలు ఏ విధంగా అర్ధం చేసుకుంటారో, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఇస్తారో లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story