పేదరికం కథ

by Ravi |
పేదరికం కథ
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఒరేయ్ అన్న చనిపోతే మళ్లీ మనకు వారం రోజులు విందు భోజనం వస్తుందంటావా?’ ఆ ఇద్దరిలోని చిన్నవాడు పెద్దవాడిని అడుగుతాడు. ‘ఆ వస్తుంది..వస్తుంది. పెద్దన్న చనిపోయినప్పుడు వారం రోజులు విందు భోజనం వచ్చింది కదా! ఇప్పుడు కూడా అలాగే వస్తుంది’ సంతోషంగా జవాబు చెప్పాడు ఆ పెద్దవాడు. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ల సోదరుడు ఎప్పుడు చనిపోతాడా? అని వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది వాళ్ల అమాయకత్వం. వాళ్ళ బీదతనం. వాళ్ల దుర్భర జీవితం.’

చాలా సంవత్సరాల క్రితం విపుల మాస పత్రికలో ఒక కథ చదివాను. ప్రపంచ భాషలలో వచ్చిన మంచి కథలను తెలుగులో అనువాదం చేయించి ప్రచురించేవారు. నేను చదివిన కథ ఏ భాషలో వచ్చిన కథో గుర్తు లేదు. కానీ, ఆ కథ నన్ను చాలా కాలం వెంటాడింది. అట్లాగే అది ఏ దేశం కథో కూడా గుర్తులేదు. కథ గుర్తుంది. ఆ కథ చదివి నా గుండె బరువెక్కింది. నా గుండే కాదు. ఎవరి గుండె అయినా బరువెక్కుతుంది. ఈ కథ ఎప్పుడు గుర్తుకొచ్చినా గుండె బరువెక్కిపోతుంది. గత పది రోజులుగా ఈ కథ చాలా గుర్తుకొస్తున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందుకు కారణం కావచ్చు. ఈ పరిస్థితిని చూసి గుండె బరువెక్కడం అంతగా లేదు కానీ బాధతో మూలుగుతుంది.

ఇక ఆ కథ లోకి వెళ్దాము…

ఒకానొక దేశం. ఆ దేశంలో ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం. రోజూ కష్టపడితే కానీ పూట గడవని పేద కుటుంబం అది. ఆ కుటుంబ పెద్దకి నలుగురు పిల్లలు. ఒక భార్య. ఒక పూట గంజి రెండో పూట కాసింత అన్నం తినే పరిస్థితి వాళ్లది. అంతటి బీదరికం. ఎంత కష్టపడ్డా సరిగ్గా గడవని పరిస్థితి. పిల్లలని పనిలో పెడదామంటే కూడ ఎవరూ పెట్టుకోలేని పరిస్థితి ఆ గ్రామంలో. ఒకసారి ఆయన పెద్ద కొడుక్కి జ్వరం వచ్చింది. ఆయనకి తొమ్మిది సంవత్సరాలు. వాళ్లకు తోచిన పసర్లు తాగించారు. కానీ, ఫలితం లేకపోయింది. జ్వరం తగ్గలేదు సరికదా, తీవ్ర రూపం దాల్చింది. నాలుగు రోజుల తర్వాత ఆ కుర్రవాడు చనిపోయాడు తల్లిదండ్రులు బాధలో మునిగిపోయారు. ఆ గ్రామంలో ఓ సాంప్రదాయం ఉంది. ఎవరైనా చనిపోతే ఆ ఇంటివాళ్లకి ఓ వారం రోజుల భోజనం పంపించడం ఆ గ్రామస్తులకు అలవాటు. ఆ సాంప్రదాయం ప్రకారం ఆ నిరుపేద కుటుంబానికి ఓ వారం రోజులు గ్రామస్తులు మంచి భోజనం పంపిస్తారు. తల్లిదండ్రులు బాధతో, వాళ్ల పిల్లలు ఆనందంగా భోజనాన్ని స్వీకరిస్తారు. ఆ పిల్లలకి అది గొప్ప విందు భోజనం.

ఆ భోజనం ఎందుకు వస్తుందో, వాళ్లకి ఏమీ అర్థం కాదు. తల్లిని అడిగి తెలుసుకుంటారు. తమ సోదరుడు చనిపోయినాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్లు భోజనాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. ఆ వారం తర్వాత వాళ్ళ పరిస్థితి మామూలుగా అయిపోతుంది. గతంలో మాదిరిగా ఉదయం పూట గంజి నీళ్లు, రాత్రిపూట ఇంత కారం మెతుకులు. అలా గడుస్తూ ఉంటుంది. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా తమ పిల్లలకు సరైన భోజనాన్ని పెట్టలేకపోతారు. వాళ్లు ఎంత శ్రమించినా వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి మార్పు రాదు. అంతే కాదు. ఇంకా కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఇలాంటి గడ్డు పరిస్థితులలో వాళ్ల రెండవ కొడుక్కి ఏదో వింత జబ్బు వస్తుంది. ఈసారి ఆ గ్రామంలో ఉన్న వైద్యున్ని కూడా పిలుస్తారు. ఆయన ఇచ్చిన మందులు ఏ మాత్రం పనిచేయవు. వారం రోజులు గడుస్తాయి. జబ్బు ముదిరిపోతుంది. ఆ కుర్రవాడి ఆరోగ్యం క్షీణించి పోతుంది. వాళ్ళ అమ్మ కూడా పని మానేసి ఇంటి దగ్గరే ఉండి కొడుకు యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటుంది. మిగతా ఇద్దరు పిల్లలు తమ సోదరుని వైపు తరచూ చూస్తూ ఉంటారు. వాళ్లు ఎందుకలా చూస్తున్నారో ఆ తల్లికి అర్థం కాక పోయేది.

వాళ్ళు ఒక రోజు ఇలా మాట్లాడుకుంటారు. ఒరేయ్ అన్న చనిపోతే మళ్లీ మనకు వారం రోజులు విందు భోజనం వస్తుందంటావా?’ ఆ ఇద్దరిలోని చిన్నవాడు పెద్దవాడిని అడుగుతాడు. ‘ఆ వస్తుంది..వస్తుంది. పెద్దన్న చనిపోయినప్పుడు వారం రోజులు విందు భోజనం వచ్చింది కదా! ఇప్పుడు కూడా అలాగే వస్తుంది’ సంతోషంగా జవాబు చెప్పాడు ఆ పెద్దవాడు. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ల సోదరుడు ఎప్పుడు చనిపోతాడా? అని వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది వాళ్ల అమాయకత్వం. వాళ్ళ బీదతనం. వాళ్ల దుర్భర జీవితం.

ఇదీ కథ…

ఈ కథను చదివినప్పుడు నేను స్తబ్దుగా అయిపోయాను. నేనే కాదు ఈ కథ చదివిన ఎవరైనా స్తబ్దులుగా అయిపోతారు. ఇది చాలా సంవత్సరాల క్రితం చదివిన కథ. బీదరికం ఎక్కడ కనిపించినా ఈ కథ గుర్తుకు వచ్చేది. మనస్సు బాధతో నిండిపోయేది. ఈ మధ్యన ఈ కథ తరచూ గుర్తుకొస్తుంది.
దళితబంధు పథకం తమదాకా వస్తుందో లేదో అని ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రమంతటా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది, కానీ, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిని చూసి ప్రజలకి విశ్వాసం కలగటం లేదు. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బాగుంటుందని అన్ని నియోజకవర్గాల ప్రజలు కోరుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా సాంఘిక మాధ్యమాలలో సందేశాలు చెక్కర్లు కొడుతున్నాయి. అంతవరకు పరవాలేదు కానీ, ఈ కథ గుర్తుకొచ్చి మనస్సు విలవిలలాడుతున్నది.

– జింబో రాజేందర్

Advertisement

Next Story