తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారింది: గూడెం మహిపాల్‌రెడ్డి  

by Shyam |
gudem mahipalreddy
X

దిశ గుమ్మడిదల : వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టించడంతో పాటు రైతును రాజు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు దినోత్సవం పురస్కరించుకొని రైతు సంఘం అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందన్నారు.

రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు రైతు పండించిన ధాన్యాన్ని అత్యుత్తమ ధరకు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట ప్రత్యక్ష దైవంగా మారారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల అనుసరిస్తున్న మొండివైఖరి మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి అండగా నిలవడంతో పాటు ప్రభుత్వం సూచించిన విధంగా పంట మార్పిడి చేయాలని కోరారు. అనంతరం గుమ్మడిదల మండల పరిధిలో వినూత్న సాగు పద్ధతులు ద్వారా అత్యధిక దిగుబడి సాధిస్తున్న రైతులను ఎమ్మెల్యే జిఎంఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, గుమ్మడిదల సర్పంచ్ నరసింహారెడ్డి , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, రైతు సంఘం జిల్లా నాయకులు దేవాలయ కమిటీ అధ్యక్షులు బాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed