ఆ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్ లింక్ చైన్‌ను తెంచనున్న సర్కార్.. ఇక నుంచి అందరికీ సేమ్ రూల్స్?

by Gantepaka Srikanth |
ఆ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్ లింక్ చైన్‌ను తెంచనున్న సర్కార్.. ఇక నుంచి అందరికీ సేమ్ రూల్స్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఆరోగ్యశాఖలోని విభాగాల్లోని ఇంటర్ లింక్ చైన్‌ను తెంచి, ఒక్కో విభాగానికి స్పష్టమైన పరిధిని కేటాయించనున్నారు. దీని వల్ల డిపార్ట్‌మెంట్ అకౌంట్‌బిలిటీ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను తయారు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నది. కింది స్థాయి స్టాఫ్​నుంచి హెచ్‌వోడీల వరకు రూల్స్ ఫ్రేమ్ చేయనున్నారు. బాధ్యతలు, విధులపై స్పష్టంగా క్లారిటీ ఇవ్వనున్నారు. పబ్లిక్ హెల్త్, వైద్యవిధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్​మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలను సులువైన అడ్మినిస్ట్రేషన్, పేషెంట్ కేర్ సేవలు అందించేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలిస్తున్నారు. గతంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తమిళనాడు, ఒరిస్సా, కేరళ వంటి రాష్ట్రాల్లో పర్యటించారు. మెరుగైన విధానాలపై గతంలోనే ఓ నివేదికను సర్కారుకు అందజేశారు. అందులోని స్కీమ్స్, ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేషన్ రూల్స్‌ను మన స్టేట్‌లో ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పలుమార్లు ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించి, రూల్స్ మార్చాల్సిందేనంటూ సూచించారు. ఫాస్ట్ అడ్మినిస్ట్రేషన్, వైద్యసేవల్లో సూపర్‌క్వాలిటీ ఉండేలా రూపాంతరం చెందాలని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు సర్వం సిద్ధం అవుతున్నది.

కన్‌ఫ్యూజ్ సిస్టమ్.. కమాండింగ్ కరవు?

వైద్యారోగ్యశాఖలోని నర్సింగ్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే వీరి రిక్రూట్‌మెంట్, సాలరీలు, సర్వీస్ రూల్స్ అన్నీ పబ్లిక్ హెల్త్ విభాగం మానిటరింగ్ చేస్తుంటుంది. కానీ వీళ్లలో మెజార్టీ స్టాఫ్​డైరెక్టర్ ఆఫ్​మెడికల్ ఎడ్యుకేషన్ పరిధికి చెందిన మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగం, సర్వీస్, తదితర అంశాల్లో సమస్యలు వస్తే పరిష్కరించడం సవాల్‌గా మారుతుంది. అంతేగాక హెచ్‌వోడీలు వేర్వేరుగా ఉండడం, పర్యవేక్షణ లోపించడంతో కొందరు ఉద్యోగుల పనితీరు సరిగా ఉండడంలేదు. కొందరు ఉద్యోగులైతే డీఎంఈ పరిధిలోని ఆఫీసర్ల మాట వినడం లేదని ఉన్నతాధికారులు ఆస్పత్రుల విజిట్‌లో గుర్తించారు. దీంతో జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పబ్లిక్ హెల్త్, టీవీవీపీ, డీఎంఈ, టీఎస్ఎంఎస్ ఐడీసీ, డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, తదితర విభాగాల్లోని కొన్ని కేడర్లలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరోవైపు ఆస్పత్రుల అడ్మిషన్లు, చికిత్సలోనూ ఇలాంటి సిచ్వేషన్ ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు పబ్లిక్ హెల్త్ విభాగం పరిధిలో ఉంటాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఉండగా, మెడికల్ కాలేజీలకు అనుబంధ ఆస్పత్రులుగానూ కొన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కన్వర్ట్ చేశారు. దీంతో ఒక పేషెంట్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేయడం సమస్యగా మారుతోంది. వేర్వేరు హెచ్‌వోడీల పరిధిలో ఉండటంతో కోఆర్డినేట్ లోపించి, అడ్మిషన్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తద్వారా ఎమర్జెన్సీ పేషెంట్లకు గోల్డెన్ హవర్ వంటివి మిస్ అవుతున్నాయి. దీంతో పేషెంట్ల చికిత్స అన్నింటకీ ఒకే లైన్ సిస్టమ్ ఉండేలా కొత్త నిబంధనలు తెచ్చేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నది.

హెచ్‌వోడీలకు క్లారిటీ?

ఓ జిల్లాలోని పేషెంట్ల చికిత్సలో సమస్య, ఆస్పత్రుల డెవలప్‌మెంట్‌లో ఇబ్బందులు వస్తే హెచ్‌వోడీలను కో-ఆర్డినేట్ చేయడం ఉన్నతాధికారులకు సవాల్‌గా మారింది. డీఎంహెచ్‌వో, డీసీహెచ్, డ్రగ్, ఫుడ్ ఆఫీసర్లకు ఇంటర్ లింక్ నిబంధనలు ఉన్నాయి. దీని వలన ఆరోగ్యశాఖ మంత్రి, హయ్యర్ ఆఫీసర్ల నుంచి ఆదేశాలిచ్చినా, జిల్లా స్థాయిలోని అధికారులు తమ పరిధి కాదంటూ ఒకరికొకరు డిలే చేస్తున్నారు. దీంతో ఒక్కో విభాగానికి నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ ఇవ్వనున్నారు. ఇక హెడ్ ఆఫీసులోని హెచ్‌వోడీ సర్వీస్ రూల్స్‌లోనూ మార్పులు చేయనున్నారు. ఇంత కాలం సీనియారిటీ బేస్డ్‌లో ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ ఇక నుంచి సీనియారిటీ ఒకటే కాకుండా, సమర్థవంతంగా వర్క్ చేసే వాళ్లను సర్కారే ఎంపిక చేసేలా నిబంధనలు రూపొందించనున్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీఎంఈ, టీవీవీపీ కమిషన్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వంటి పోస్టులకు ఈ రూల్ తీసుకురానున్నారు.

Advertisement

Next Story