ప్రభుత్వాసుపత్రిలో భోజనం తయారీకి నోటిఫికేషన్.. టెండర్‌లో దోబుచులాట..!

by Shiva |
ప్రభుత్వాసుపత్రిలో భోజనం తయారీకి నోటిఫికేషన్.. టెండర్‌లో దోబుచులాట..!
X

దిశ, వనపర్తి టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆహారం అందించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి మూడు నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆ విషయం ఓ కొలిక్కి రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వనపర్తి జిల్లా జనరల్ హాస్పిటల్‌లో మూడు దశాబ్దాలుగా డైట్ నిర్వహణ కొనసాగుతోంది. ఈ బాధ్యతను కాంట్రాక్ట్ పద్ధతిన అనుభవం కలిగిన సంస్థలకు అప్పజెప్పడం, ప్రభుత్వ నిబంధనకు లోబడి ఆ సంస్థ పని చేయాలి. అయితే, కాంట్రాక్ట్‌కు రెండేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం 2022 ఆగస్టులో టెండర్ దక్కించుకున్న సంస్థ గడువు పూర్తి కావడంతో కొత్త టెండర్ ప్రక్రియకు నోటిఫికేషన్ ఆగస్టులో జారీ అయింది. మూడు నెలలుగా కొత్త టెండర్ పూర్తి చేయకుండా సాగదీత వెనక దాగి ఉన్న ఆంతర్యం ఏంటో తెలియాల్సి ఉంది.

అసలు రహస్యం ఏంటో..?

ఆగస్టులో టెండర్ గడువు పూర్తి కాగా.. కొత్త నోటిఫికేషన్ జారీతో డైట్ టెండర్ ప్రక్రియకు 12 అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని పరిశీలించి 8 దరఖాస్తులను అనర్హులుగా గుర్తించారు. కాగా, మిగిలిన నలుగురిలో ఒకరికి టెండర్ అప్పగించే అవకాశం ఉన్నా, పలు రకాలతో టెండర్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో రెండోసారి కూడా రీ టెండర్ ప్రక్రియ నిర్వహించారు. కాగా, ఒక్క టెండర్ ఫామ్‌కు రూ.10 వేల చొప్పున టెండర్ దారులు మొదట్లో చెల్లించారు. మరోసారి టెండర్ ఫామ్‌కు డబ్బు ఇవ్వాలని అధికారులు చెప్పడంతో కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేశారు. రీటెండర్‌లో 9 దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత నెల 9న నిర్వహించిన టెండర్ ప్రక్రియలో 12 దరఖాస్తులు దాఖలైనట్లు, అందులో 8 మందిని అనర్హులుగా గుర్తించారు.

టెండర్ ఏ పద్ధతి నిర్వహిస్తారో..

గతంలో డైట్ టెండర్ ఎంపిక ప్రక్రియ సీల్డ్ కవర్ పద్ధతి నిర్వహించే వారు. అయితే ఆ పద్ధతిలో టెండర్‌దారుడికి 100 శాతం మార్కులు వచ్చినా.. పోటీ దారుల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. దీంతో హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌ను పలువురు కాంట్రాక్టర్లు ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ టెండర్ జీవో ప్రక్రియ అవకతవకలు ఉన్నట్లు కమిషనర్‌కు తెలిపినట్లు సమాచారం. దీంతో డైట్ టెండర్ ప్రక్రియ రీకాల్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఈ నెల 19న రీటెండర్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, టెండర్ ప్రక్రియ సిల్ట్ కవర్ పద్ధతి‌లో జరుగుతుందా.. లేక డ్రా పద్ధతిలో తీస్తారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

బిల్లులు చేయాలంటే కండిషన్స్

ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్టర్ పద్ధతిలో పని చేస్తున్న ఏ కాంట్రాక్టర్‌కు అయినా.. బిల్లులు చెల్లించాలంటే సవాలక్ష కండిషన్స్ పెడుతున్నారంటూ కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఫార్మ కంపెనీ కాంట్రాక్టర్, పారిశుద్ధ కాంట్రాక్టర్, డైట్ కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి అధికారులు కుంటి సాకులు వెతుకుతూ.. కండిషన్స్ పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఫార్మా కాంట్రాక్టర్, పారిశుద్ధ కాంట్రాక్టర్లకు ముందస్తు బడ్జెట్ రిలీజ్ అయినా, బిల్లులు చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి‌ టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి.. అర్హులైన వారికి పనులు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.

మనిషికి రూ.80 కేటాయింపు..

ప్రభుత్వాసుపత్రిలో రోగులకు భోజనం ఏర్పాట్లు చేసి, వడ్డించేందుకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రూ.80 కేటాయిస్తుంది. కానీ, టెండర్ ప్రక్రియలో ఎవరైతో ప్రభుత్వం కేటాయించిన దాని కంటే, తక్కువకు భోజనం పెడతామని దరఖాస్తులో పేర్కొన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఇటీవల అర్హులుగా ఉన్నా వారు టెండర్ దక్కకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, కమిటీ నిర్వాహకులు అనుకుంటే జాప్యం లేకుండా జరగాల్సిన డైట్ టెండర్ ప్రక్రియ ఎప్పుడో ఖరారయ్యేది. ఈ క్రమంలోనే అధికారుల సాగదీత ధోరణిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed