అనుమానాస్పద స్థితిలో భర్త మృతి.. కాదు హత్యే అంటున్న భార్య

by srinivas |   ( Updated:2021-08-14 08:40:01.0  )
old man
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఓ వృద్ధుడు అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. బోడపాటి వారిపాలెంకు చెందిన బోడపాటి శ్రీరామమూర్తి(75) తన భార్య సత్యవతితో కలిసి జీవిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. దీంతో భార్యభర్తలు మాత్రమే ఆ ఇంటిలో నివశిస్తున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి శ్రీరామమూర్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తన భర్తను ముగ్గురు వ్యక్తులు గొంతు నుళిమి హత్య చేశారని భార్య సత్యవతి ఆరోపిస్తోంది. అర్ధరాత్రి ముగ్గురు యువకులు తమ ఇంటికి వచ్చారని తన భర్తను డబ్బుల గురించి అడిగినట్లు ఆమె చెప్తోంది. మరోవైపు తనను కూడా స్తంభానికి కట్టేసి తన భర్తను గొంతు నులిమి చంపేశారని బోరున విలపించింది.

తన భర్తను హత్య చేసిన తర్వాత వారు పరారయ్యారని.. ఆ తర్వాత తాను నెమ్మదిగా కట్లు తెంచుకుని చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు వచ్చి 108కు ఫోన్ చేసినట్లు తెలిపింది. 108 సిబ్బంది వచ్చేసరికి శ్రీరామమూర్తి మరణించాడని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రావులపాలెం సీఐ కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే మృతదేహంపై గొంతునులిమిన ఆనవాళ్లు లేవని చెప్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తామని తెలిపారు. శ్రీరామమూర్తికి మంచి వ్యక్తిగా పేరుంది. పిల్లలు లేకపోవడంతో తమ ఆస్తిని పేదలకు దానం చేశారు. 50సెంట్ల భూమిని తమ గ్రామంలో ఇళ్లులేని నిరుపేదలకు పంచి ఇచ్చారు. దీంతో ఆ భూముల్లో సుమారు 10 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అంతటి మంచి మనిషి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed