విలేజ్ కుకింగ్ ఛానల్‌కు కోటి మంది subscribers

by Shyam |   ( Updated:2023-05-19 12:56:09.0  )
VCC,-Youtube-channel
X

దిశ, ఫీచర్స్ : మనలో స్పెషల్ ఆర్ట్ ఉందా? అయితే చాలు.. వయసు, చదువుతో సంబంధం లేదు. విలేజ్‌ బ్యాక్‌గ్రౌండ్ అయినా, మారుమూల ప్రాంతమైనా.. ఎక్కడి నుంచైనా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన టాలెంట్‌ను క్షణాల్లో ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. అందులో భాగంగానే చాలా మంది యూట్యూబ్ వేదికగా తమ ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్‌ను సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ‘విలేజ్ కుకింగ్ చానల్(VCC)’ కూడా కోటి మంది సబ్‌స్రైబర్లను చేరుకుని.. ఆ రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన మొదటి యూట్యూబ్ ఛానల్‌గా అవతరించింది. అంతేకాదు తాజాగా సీఎం కొవిడ్-19 రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళాన్నీ అందజేసింది.

తమిళనాడుకు చెందిన చిన్న వీరమంగళం.. తన మనుమలు మురుగేశన్, తమిలేశన్, అయ్యనార్, ముత్తుమాణిక్యం, సుబ్రమణ్యన్‌తో పాటు గతంలో క్యాటరర్‌గా పనిచేసిన పెరియతంబి కలిసి 2018లో VCC చానల్‌ను ప్రారంభించారు. వీరిలో సుబ్రమణ్యన్ కామర్స్‌లో ఎంఫిల్ చేయగా.. ముత్తుమాణిక్యం కేటరింగ్ కోర్సు చదివాడు. తల్లి నుంచి నేర్చుకున్న వంటలను గ్రాండ్ ఫాదర్ గైడెన్స్‌లో చేస్తూ లాక్‌డౌన్‌కు ముందు వారానికి నాలుగు ఎపిసోడ్లు యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవారు. కానీ పాండమిక్ పరిమితుల కారణంగా ఇప్పుడు వారానికి ఒకటి మాత్రమే అప్‌లోడ్ చేస్తున్నారు.

వీరు తయారుచేసే వంటకాల సంగతి పక్కనబెడితే.. షూటింగ్‌తో పాటు ప్రజెంటేషన్‌లో చూపించే ప్రత్యేకతే ఈ ఛానల్‌ను పాపులర్ చేసింది. పైగా పుడుకొట్టై చుట్టుపక్కల గల నదీతీరాలు, పంటపొలాల్లోనే వీరు కుకింగ్ వీడియోలను చిత్రీకరిస్తారు. ఇందుకోసం భారీ పాత్రల్లో ఎక్కువ మొత్తంలో వంటలు చేసే ఈ విలేజ్ చెఫ్స్.. తర్వాత ఆ ఫుడ్‌ను స్థానికులకే ఇవ్వడం గొప్ప విషయం. ఈ మేరకు ఛానల్ ద్వారా నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్న టీమ్‌కు ఫేస్‌బుక్ పేజీ నుంచి అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. కాగా ఈ కుకింగ్ షో మేకింగ్‌కు నెలకు దాదాపు రూ.2 లక్షలు ఖర్చవుతోంది.

స్పెషల్ డిషెస్..
నాన్ వెజిటేరియన్ వంటకాలే VCC స్పెషాలిటీ. సమీపంలోని నదిలో లభించే చేపలు, నత్తలు, పీతలను లైవ్‌గా పట్టుకొచ్చి స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేస్తుంటారు. ఇందుకు ఉపయోగించే మసాలాలు, దినుసులు అన్నీ కూడా స్థానికంగా లభించేవే. అంతేకాదు కుకింగ్‌ కోసం మిక్సర్, బ్లెండర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను అస్సలు ఉపయోగించరు. స్టోన్ గ్రైండర్‌ యూజ్ చేయడంతో పాటు వంటలన్నీ కట్టెల పొయ్యి మీదనే కానిస్తారు. ఇక వీరి వంటకాల్లో రెక్కల చెదపురుగులతో చేసిన పఫ్డ్ రైస్ చాలా పాపులర్ అయింది.

ఈ ఏడాది జనవరిలో 7 మిలియన్ సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్న ఈ చానల్‌ వీడియోలకు 40 మిలియన్ వ్యూస్ వస్తుండేవి. ఇదే క్రమంలో బెస్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద ఫిబ్రవరిలో ‘బ్లాక్ షీప్ అవార్డు’ అందుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సైతం VCC టీమ్ కుకింగ్‌ను వీక్షించాడు. ఈ 14 నిమిషాల ఎపిసోడ్‌లో VCC టీమ్ మష్రూమ్ బిర్యానీ, రైతా ప్రిపేర్ చేయగా.. రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ లీడర్స్ కూడా తినడం విశేషం.

Advertisement

Next Story