- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణేష్ ఉత్సవ కమిటీలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధక్షతన గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవరెడ్డి, భగవంత రావు, ఖైరతాబాద్, బాలాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన గణేష్ మండప నిర్వాహకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10వ తేదీన విగ్రహాల ప్రతిష్టతో ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 19 వ తేదీన నిర్వహించే శోభాయాత్ర, నిమజ్జనం కార్యక్రమంతో ముగుస్తుందని తెలిపారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వాహకులు ఆయా ప్రాంతాలలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అలాంటి అధికారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ విషయం పై స్థానిక పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్‌ల ద్వారా ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డికి ఆయన సూచించారు.
నగరంలో ఎంతో ప్రసిద్ది గాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పూర్తిగా ద్వంసమైందని ఉత్సవ నిర్వాహకులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన మంత్రి ఆయా ప్రాంతాలను సోమవారం సందర్శించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసు అధికారులు సహకరించాలని, క్రేన్ ను ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటి అద్యక్షుడు సుదర్శన్ కోరారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన విగ్రహాల నిమజ్జనం సమయంలో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి నిర్వాహకులతో పాటు ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.