ప్రభుత్వమే పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలి

by Aamani |
Podu Lands
X

దిశ, నిజామాబాద్ సిటి: పోడు రైతులకు హక్కులు కల్పించాలని పులాంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. కాంగ్రెస్,వామపక్షాలు, మిత్రపక్షాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రభాకర్, సీపీఎం కార్యదర్శి రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి భూమయ్య మాట్లాడారు.

All Party Leadars

గత 40 సంవత్సరాలుగా గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా కందకాలు కొడుతున్నారని ఆరోపించారు. సిరికొండ మండలం అమీర్ నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్ ప్రాంతాలల్లో అధికారులు కందకాలు తవ్వుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో చిత్తశుద్ధి ఉందని చెబుతున్నారని కానీ, జిల్లాల్లోని అధికారులు, మంత్రులు దీనిపై మాట్లాడడం లేదని, ఇది ముఖ్యమంత్రి ద్వంద్వ నీతికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. గంగారాయి గ్రామంలో గిరిజన మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి చలనం లేదని అన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో అధికారులు గిరిజనుల భూముల్లో కందకాలు కొడుతుంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. వచ్చే నెల 5వ తేదీన అఖిల పక్షాల పిలుపు మేరకు పోడు భూముల హక్కుల సాధనకై ఆదిలాబాద్ నుండి అచ్చంపేట వరకు రహదారి నిర్బంధానికి పోడు రైతులు హాజరై విజయవంతం చేయాలని మానాల మోహన్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్, పీసీసీ కార్యదర్శి నాగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వేణు రాజు, సీపీఎం నాయకులు లతా, నూర్జహాన్, గోవర్ధన్, అఖిల పక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

Next Story