‘సీఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తే.. కేంద్రానికి వణుకే’

by Sridhar Babu |   ( Updated:2021-11-20 02:09:20.0  )
‘సీఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తే..  కేంద్రానికి వణుకే’
X

దిశ, నల్లగొండ: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద సీఎం కేసీఆర్ నిర్వహించిన ధర్నాతోనే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దిగొచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని గుత్తా క్యాంపు కార్యాయలంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు. తనను రెండోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు గుత్తా ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ రైతులకోసం చేసిన పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని, తెలంగాణాలో ఎంత మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వానాకాలం సీజన్‌లో ఎఫ్సీఐకి ధాన్యాన్ని తరలించడం లేదని, రైల్వే వ్యాగన్లను కేటాయించడం లేదని అన్నారు. కావాలనే వ్యాగన్లు కేటాయించకుండా, కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. మోడీ తీసుకునే నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బీజేపీ నేతలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బాధ్యతో వ్యవహరించి, యాసంగిలో ఉప్పుడు బియ్యం కోనుగోలు చేసేలా బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ బుద్ధి తెచ్చుకో: ఎమ్మెల్యే కంచర్ల

బండి సంజయ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, రబీ సీజన్‌లో రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. రైతులకు న్యాయం చేకూర్చేలా బీజేపీ రాష్ట్ర నాయకులంతా ప్రయత్నించాలని అన్నారు. బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలని, మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేసిందని, ఇది రైతుల విజయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ధర్నాతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి షాక్ తగిలిందన్నారు. రైతులతో రాజ్యాలే కూలిపోతాయని, ప్రైవేట్ పరం చేసిన ప్రభుత్వ సంస్థలను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ పిడికిలి బిగించడంతోనే షాక్: ఎమ్మెల్యే భాస్కర్ రావు

రైతుల శక్తి ఎంటో మోడీకి అర్థమైయిందని, సీఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే కేంద్రానికి షాక్ తగిలిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఎద్దేవా చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల విజయానికి నాంది అని అన్నారు. కేంద్రంపై పోరాడిన సీఎం కేసీఆర్ కు రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో ప్రపంచానికే పోరాటాలు నేర్పిన తెలంగాణ గడ్డ అని, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ గర్జించడంతోనే కేంద్రం మెడలు వంచిందని అన్నారు. యాసంగిలో కూడా ఎఫ్సీఐ ద్వారా కేంద్రం ధాన్యం కొనుగోళ్ళు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లిడర్ పాశం రాం రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్, వ్యవసాయ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story