7.4 బిలియన్ వ్యూస్‌తో ‘బేబీ షార్క్’ రికార్డ్

by Anukaran |   ( Updated:2020-11-03 06:06:46.0  )
7.4 బిలియన్ వ్యూస్‌తో ‘బేబీ షార్క్’ రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్ : క్యాచీ ఇంగ్లీష్ పదాలతో తమిళ పదాలను మిక్స్ చేసి ‘వై దిస్ కొలవెరి’ అంటే.. జనాలు వెర్రెక్కిపోయారు. అలా చిన్న చిన్న మాటలతో వచ్చే పాటలు నెటిజన్లను త్వరగా ఆకర్షిస్తాయనేందుకు ఆ పాటే బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి పాటల్లో ‘బేబీ షార్క్’ వీడియో సాంగ్ కూడా ఒకటి. చిన్న పిల్లల్ని ఆకట్టుకునే రీతిలో రూపొందించిన ‘బేబీ షార్క్’ పాట.. ప్రస్తుతం యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డుల్లోకి ఎక్కింది.

దక్షిణ కొరియాకు చెందిన పింక్ ఫాంగ్, అమెరికాకు చెందిన క్యాంప్‌ఫైర్ పాటను రీమిక్స్‌ చేసి ‘బేబీ షార్క్’ అనే పాటను రూపొందించాడు. 2016 జూన్‌లో ఈ పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా, చిన్న పిల్లలతో పాటు అన్ని వర్గాల వారిని విపరీతంగా ఆకట్టుకుంది. 2019లో బిల్‌బోర్డ్ హాట్ 100లో 32వ స్థానాన్ని కూడా పొందింది. ఈ క్రమంలోనే తాజాగా 7.4 బిలియన్ల వ్యూస్‌తో వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోగా లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీకి చెందిన ‘డెస్పాసిటో’ ఉండగా.. ప్రస్తుతం బేబీ షార్క్ పాట ఆ రికార్డును బద్దలు కొట్టింది. కాగా యూట్యూబ్‌లో డెస్పాసిటో పాట ప్రస్తుతం 7.3 బిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది.

రెండు నిముషాల 16 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో ఓ పాప, బాబు మాత్రమే ఉంటారు. మొదటి నిమిషం పాటు.. బేబీ షార్క్, మామ్ షార్క్, డాడీ షార్క్, గ్రాండ్ మా షార్క్, గ్రాండ్ పా షార్క్, డూడూడూ.. అనే పదాలు మాత్రమే ఉంటాయి. మరో నిమిషం పాటు ‘లెట్స్ గో, రన్ వే, సేఫ్ ఎట్ లాస్ట్, ఇట్స్ ద ఎండ్ డూడూడూ’ అనే పదాలు వినిపిస్తాయి.

కాగా, వాషింగ్టన్ నేషనల్స్ బేస్ బాల్ టీమ్ ఈ పాటను తమ యాంథెమ్‌గా ఎంచుకోవడం విశేషం. అంతేకాదు ఈ పాట ఇచ్చిన ఉత్సాహంతో గత సంవత్సరం వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న ఈ జట్టు ఆటగాళ్లు.. విజయం సాధించారు కూడా. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో చిన్నారుల్లో పరిశుభ్రత అలవాట్లపై అవగాహన కల్పించేందుకు అనుగుణంగా ‘వాష్ యువర్ హాండ్స్’ అంటూ ఈ పాటకు మరో వర్షన్ విడుదల చేయడం విశేషం. 2017లో ఇండోనేషియాలో ‘బేబీషార్క్ చాలెంజ్’ సూపర్ పాపులర్ అయ్యింది. 2018లో టిక్ టాక్ ట్రెండింగ్‌లో నిలిచింది.

Advertisement

Next Story