ఆ పరీక్షల వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు

by Anukaran |   ( Updated:2020-08-17 03:18:36.0  )
ఆ పరీక్షల వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్), ఐఐటీల ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లు వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. నీట్, జేఈఈలను వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

పరీక్షల నిర్వహణకు కావల్సిన ముందుజాగ్రత్తలన్నీ తీసుకోబోతున్నట్టు అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని వివరించింది. ‘జీవితాన్ని ఆపరాదు. అన్ని రకాల జాగ్రత్తలతో ముందుకు కదలాల్సిందే. ఏడాదంతా వృథా చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా? విద్య కొనసాగాల్సిందే. కరోనా మరో ఏడాది ఉండొచ్చు. మరో సంవత్సరకాలమూ ఎదురుచూస్తూనే ఉంటారా?’ ధర్మాసనం అని ప్రశ్నించింది. 11 రాష్ట్రాల నుంచి 11 మంది విద్యార్థులు ఈ పరీక్షలను వాయిదావేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ షెడ్యూల్..

జేఈఈ మెయిన్ వచ్చే నెల 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష ఉంటుంది. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. కరోనా కారణంగా నీట్, జేఈఈలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. మహమ్మారి ఇంకా వెనక్కితగ్గకపోవడంతో ఈ పరీక్షలను ఇంకా వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed