ఒక్క ట్వీట్..ఛైర్మన్ పదవికే ముప్పు తెచ్చింది!

by Harish |
ఒక్క ట్వీట్..ఛైర్మన్ పదవికే ముప్పు తెచ్చింది!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఒక ట్వీట్ చేయడం వల్ల సంస్థ కొన్ని బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఎలన్ మస్క్ ఒక ట్వీట్ చేయడంతో టెస్లా సంస్థ షేర్ విలువ 80.56 డాలర్లు క్షీణించి 701.32 డాలర్లకు దిగజారింది. ఈ నష్టంతో సంస్థ మార్కెట్ విలువ గంటల వ్యవధిలో 15 బిలియన్ డాలర్లను కోల్పోయింది. అలాగే, ఎలన్ మస్క్ సొంత వాటాలో 3 బిలియన్ డాలర్లు వెళ్లిపోయాయి. ‘టెస్లా షేర్ విలువ అధికంగా ఉంది’.. ఇదే ఎలన్ మస్క్ చేసిన ట్వీట్. ఈ ఒక్క మాటతో టెస్లా షేర్లు ఒక్కసారిగా 10 శాతం తగ్గిపోయాయి.

2020 సంవత్సరం ప్రారంభం నుంచి టెస్లా సంస్థ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో టెస్లా కంపెనీకి బాగా లాభాలు వచ్చాయి. ఈ ట్రెండ్‌తో టెస్లా కంపెనీకి మరిన్ని లాభాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ ట్వీట్‌తో ఒక్కసారిగా అవన్నీ పోయాయని, పైగా ఈ ట్వీట్ కారణంగా సీఈవో పదవికి ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలన్ మస్క్ గతంలోనూ వివాదాస్పద ట్వీట్ పెద్ద దుమారం లేపింది. అప్పుడు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ 40 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ పెనాల్టీని ఎలన్ మస్క్, టెస్లా సంస్థ చెరో సగం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా వివాదంతో టెస్లా డైరెక్టర్ల బోర్డులో ఉన్న ఎలన్ మస్క్ ఛైర్మన్ పదవికే ప్రమాదం ఏర్పడింది.

Tags: elon musk, tesla inc, Twitter, coronavirus, exchange commission

Advertisement

Next Story

Most Viewed