ఈగలతో విసిగిపోయారా.. ఇలా చేయండి!

by Satheesh |
ఈగలతో విసిగిపోయారా.. ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగానే ఉంటుంది. రోడ్లకు ఇరువైపులా వర్షపు నీరు నిల్వ ఉండటమే కాక మురికి కాలువలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో సాధారణంగానే దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. ఇవి ఇల్లంతా సంచరిస్తూ పళ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలపై వాలుతుంటాయి. అవే పదార్థాలను తినడం వల్ల మనుషులు జబ్బుల బారిన పడతారు. మరి ఈ బాధల నుంచి విముక్తి పొందాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

* ఒక గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్ల ఉప్పు తీసుకుని బాగా కలపాలి. ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి ఈగలు వాలుతున్న చోట చల్లాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఈగల గోల నుంచి విముక్తి లభిస్తుంది.

* పుదీనా, తులసి ఆకులతో కూడా ఈగలను తరిమికొట్టవచ్చు. వీటిని పొడి లేదా పేస్ట్ రూపంలో తయారుచేసి నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఈగలపై చల్లితే తప్పకుండా ఫలితం ఉంటుంది.

* ఒక గ్లాస్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని, దానికి కొన్ని చుక్కల డిష్ సోప్ యాడ్ చేయాలి. గ్లాస్‌పై ప్లాస్టిక్ ర్యాపర్‌ పెట్టి రబ్బర్ బ్యాండ్ వేయాలి. ఆ తర్వాత టూత్ పిక్‌తో ర్యాపర్‌పై రంధ్రాలు చేయాలి. దీనికి ఆకర్షించబడిన ఈగలు రంధ్రాల ద్వారా గ్లాస్ లోపలికి వెళ్తాయి. కానీ తిరిగి బయటకు రాలేవు. ఇంట్లో అక్కడక్కడా ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటే ఈగల బెడద నుంచి తప్పించుకోవచ్చు.

* ఒక గ్లాస్ పాలలో ఒక టీ స్పూన్ నల్ల మిరియాలు, మూడు టీస్పూన్ల చక్కెర వేసి కలుపుకోవాలి. ఇంట్లో ఈగలు ఎక్కువగా తిరిగే చోట ఈ పాలను ఉంచితే ఆకర్షించబడి అందులోనే పడి మునిగిపోతాయి.

* వీనస్ ఫ్లై ట్రాప్ : ఇది కీటకాలను తినే మాంసాహార మొక్క. వీనస్ ఫ్లైట్రాప్ ప్లాంట్‌ను ఇంటి బయట లేదా లోపల 1-2 మూలల్లో ఉంచుకోవాలి. నోరు తెరుచుకుని ఉండే ఈ మొక్కలు.. ఈగలు వాలిన వెంటనే వాటిని పట్టుకుంటాయి. కానీ మనం ఈ మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడమే కాక వాటికి కొంచెం దూరంగా ఉండాలి..

* ఈగలను నియంత్రణకు కర్పూరం బాగా పని చేస్తుంది. కర్పూరం లేదా వేపాకుతో ఇంట్లో పొగ వేసుకుంటే దెబ్బకు ఈగలు పరార్ అవుతాయి..

* యాపిల్‌ పండుపై కొన్ని లవంగాలు వేసి వంటగదిలో ఒకచోట పెట్టాలి. ఈ వాసన ఈగలను నిర్మూలిస్తుంది. అలాగే ఫ్లోర్ క్లీనింగ్ కోసం లవంగాల నూనెను ఉపయోగించవచ్చు. ఈగలకు లవంగాల నూనె అంటే పడదు కాబట్టి ఆ వాసనకు దూరం అవుతాయి.

* కొద్దిగా కేయాన్ పెప్పర్ అంటే ఎండు మిర్చి పొడిని బాటిల్‌లో తీసుకుని, దానిలో నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఇంట్లో స్ప్రేయడం వల్ల ఈగలు వాలకుండా ఉంటాయి.

* దాల్చిన చెక్క పొడి లేదా దాల్చిన చెక్కను ఎయిర్ రిఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు. ఈ వాసనకు ఇంట్లో ఈగలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.

Advertisement

Next Story