ఇతడి రూటే సపరేటు.. ఫుల్‌గా తాగించి ఆ తర్వాత తన పని కానిస్తాడు..

by Satheesh |
ఇతడి రూటే సపరేటు.. ఫుల్‌గా తాగించి ఆ తర్వాత తన పని కానిస్తాడు..
X

దిశ, శంషాబాద్: మద్యం షాపు వద్ద వ్యక్తులను పరిచయం చేసుకొని వారి వద్ద నుండి నగదును ఎత్తుకెళ్తున్న వ్యక్తిని మైలార్దేవుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన సందీప్ (32) గత కొంత కాలంగా మైలార్దేవుపల్లి పరిధిలోని లక్ష్మిగూడ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన సందీప్.. వైన్ షాప్, కళ్ళు కాంపౌండ్ వద్ద వ్యక్తులను పరిచయం చేసుకొని వారితో మద్యం సేవించి.. వారి వద్ద నుండి నగదు, సెల్ ఫోన్‌లు దొంగిలించి పరారయ్యేవాడు. ఇదే క్రమంలో శ్రీరామ్ కాలనీకి చెందిన నరసింహను.. నిందితుడు సందీప్ వైన్ షాపు వద్ద పరిచయం చేసుకున్నాడు. ఫిబ్రవరి 27వ తేదీన సందీప్‌.. నరసింహకు మద్యం ఎక్కువగా తాగించి అతడి జేబులో ఉన్న ఏటీఎం కార్డును దొంగిలించాడు. నరసింహ అకౌంట్‌ నుండి సుమారు 2లక్షల 17వేల రూపాయలు సందీప్ దొంగలించాడు. ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసి వాటిని విలాసాలకు వాడుకునే వాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సందీప్‌పై నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 1లక్ష 39వేల రూపాయలు విలువచేసే ప్రాపర్టీతో పాటు ఏటిఎం కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు సందీప్‌ను కోర్టులో హాజరు పరచి.. రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో డీఐ బాల్ రాజ్ గౌడ్, డీఎస్ఐ కుమార్ గౌడ్ ఉన్నారు.

Advertisement

Next Story