శంషాబాద్ విమానాశ్రయంలో సగటు కన్నా 109% ఎక్కువ దేశీయ ప్రయాణికులు

by Mahesh |
శంషాబాద్ విమానాశ్రయంలో సగటు కన్నా 109% ఎక్కువ దేశీయ ప్రయాణికులు
X

దిశ, శంషాబాద్ : అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు మార్చి 27 నుంచి పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ కేసుల తగ్గుదల, పర్యాటకుల కోసం దేశాలు ఆంక్షలు సడలించడంతో, పర్యాటక రంగం మరోసారి పుంజుకుంటోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణ, మధ్య భారతదేశం నుంచి ప్రయాణించే ప్రజలకు ప్రధాన ప్రయాణ కేంద్రంగా ఉంటుంది. అతిపెద్ద రవాణా కేంద్రంగా ఇది సమీప నగరాల నుంచి వచ్చే ప్రయాణీకులకు అనుకూలం. ఇక్కడి నుంచి కేవలం 2 గంటల వ్యవధిలో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశముంది. ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ కు ముఖద్వారంగా ఉన్న హైదరాబాద్ నుంచి ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

కోవిడ్ అనంతరం హైదరాబాద్ నుంచి వెళ్లే గమ్యస్థానాలలో అసాధారణ వృద్ధి ఉంది. కోవిడ్ పూర్వం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 55 దేశీయ గమ్యస్థానాలుండగా, ఇప్పుడది 70 కు చేరింది. టైర్ II-టైర్ III నగరాలకు ప్రయాణికులకు ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించడానికి ఉద్దేశించిన ఉడాన్ వల్ల దేశపు నలుమూలలకూ కనెక్టివిటీ మరింత పెరిగింది. దేశీయ ప్రయాణాలు పుంజుకోవడంతో విమాన ప్రయాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒకే రోజున ప్రయాణీకుల సంఖ్య మార్చి 27న దాదాపు 53 వేలకు చేరింది. ఇది కోవిడ్‌కు ముందు రోజువారీ సగటు దేశీయ ప్రయాణికులతో పోలిస్తే ~109%. అదే రోజున అత్యధిక సంఖ్యలో కోవిడ్ అనంతర దేశీయ ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్స్ లు 374 నమోదయ్యాయి. మార్చి నెల మొదటి అర్ధ భాగంలో (1-15) విమానాశ్రయం నుంచి సుమారు 7 లక్షల మంది దేశీయ ప్రయాణికులు, లక్ష మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో అంతర్జాతీయ సర్వీసులు చాలా తగ్గినా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇప్పుడు సింగపూర్, ఖతార్, షార్జా, దోహా, కువైట్ వంటి మునుపటి గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ సిఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయినందున, రాబోయే నెలల్లో అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ పెరుగుతుందని మేం అంచనా వేస్తున్నాము. వేసవి షెడ్యూల్‌లో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల నుండి వచ్చిన అపూర్వ స్పందన విమాన రంగం సాధారణ స్థితికి చేరుకుందనడానికి రుజువు అన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరిన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించడానికి మేము మా భాగస్వాములందరి తో కలిసి పని చేస్తున్నాము. ప్రయాణికుల సౌకర్యార్థం మేము మా మొదటి దశ విమానాశ్రయ విస్తరణను త్వరలో ప్రారంభిస్తాము అన్నారు.



Advertisement

Next Story

Most Viewed