నిబంధనల ప్రకారమే ప్రెస్ మీట్ పెట్టా : ఏబీ వెంకటేశ్వరరావు

by samatah |   ( Updated:2022-04-06 09:45:46.0  )
నిబంధనల ప్రకారమే ప్రెస్ మీట్ పెట్టా : ఏబీ వెంకటేశ్వరరావు
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఘాటుగా సమాధానం ఇచ్చారు. పెగాసస్ అంశంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. అయితే తమను సంప్రదించకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులకు ఏబీ వెంకటేశ్వరరావు గట్టిగా సమాధానం ఇచ్చారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని చెప్పుకొచ్చారు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న.. రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

'నేను ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పాను. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు. గౌరవానికి భంగం కలిగించేలా నాపై, నా కుటుంబం పై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటాను. రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాధమిక హక్కు మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని తెలిపారు. మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలియజేశాను'.రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్‌ను కూడా ప్రభుత్వానికి ఇచ్చిన వివరణలో ఏబీ వెంకటేశ్వరరావు పొందుపరిచారు.

Advertisement

Next Story