35 గంటల పాటు పెయింటింగ్.. ఓపికగా కూర్చున్న ప్రిన్సెస్ డయానా!

by GSrikanth |   ( Updated:2023-03-31 16:15:11.0  )
35 గంటల పాటు పెయింటింగ్.. ఓపికగా కూర్చున్న ప్రిన్సెస్ డయానా!
X

దిశ, ఫీచర్స్ : వేల్స్ యువరాణి, ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య డయానాకు సంబంధించిన అసాధారణమైన, అరుదైన పెయింటింగ్ ఇటీవల వేలంలో విక్రయించిన తర్వాత మొదటిసారిగా లండన్‌లో ప్రదర్శనకు పెట్టారు. ఈ ఆయిల్ స్కెచ్ పెయింటింగ్‌ను అధికారిక ఫుల్ లెంగ్త్ పోర్ట్రెయిట్ కోసం 'ప్రిపరేటరీ స్టడీ (సన్నాహక అధ్యయనం)గా వేసింది మాత్రమే. అమెరికన్ కళాకారుడు నెల్సన్ షాంక్స్ ఈ చిత్రరాజాన్ని 1994లో పూర్తిచేశాడు. అయితే ఇది జనవరిలో సోత్‌బైస్ నిర్వహించిన వేలంలో $201,600 (INR 1,59,16,501)కి అమ్ముడుపోయి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అయితే ఈ పెయింటింగ్ వెనుక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది.

లండన్ ఆధారిత ఆర్ట్ గ్యాలరీ 'మాస్టర్ పీస్ లండన్ ఆర్ట్ ఫెయిర్‌'లో జూన్ 30 నుంచి జూలై 6 వరకు పెయింటింగ్‌ను ప్రదర్శనకు పెట్టారు. ఇక ఈ పెయింటింగ్ కోసం డయానా లండన్‌లోని షాంక్స్‌ స్టూడియోలో 30 సిట్టింగ్స్ కోసం దాదాపు 35 గంటల పాటు వెచ్చించింది. ఈ క్రమంలో షాంక్స్‌తో పాటు, అతడి భార్య లియోనా కూడా డయానాకు సన్నిహిత మిత్రురాలిగా మారింది. ఈ విషయాన్ని యువరాణి ఒక లేఖలో ప్రస్తావించడం సహా స్టూడియోకి రావడం స్వర్గధామమని.. ఆ స్థలం ప్రేమ, మద్దతుతో నిండి ఉందని కూడా అందులో పేర్కొంది.

ఈ పెయింటింగ్‌లో డయానా వెల్వెట్ హాల్టర్-నెక్ దుస్తులను ధరించి కనిపించింది. వెబ్‌సైట్ ప్రకారం, జూన్ 1997 సంచిక వానిటీ ఫెయిర్ కోసం మారియో టెస్టినో అదే దుస్తులను ధరించి ఫొటో తీశారు. 2017లో డయానా ఫ్యాషన్ లెగసీ 'డయానా: హర్ ఫ్యాషన్ స్టోరీ ఎట్ కెన్సింగ్టన్ ప్యాలెస్'పై ఎగ్జిబిషన్‌లోనూ ఇది చేర్చబడింది. అయితే ఈ చిత్తరువును చిత్రించే సమయంలో ప్రిన్స్ చార్లెస్‌‌తో ఆమెకు విడాకులని, ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని పత్రికల్లో పలు కథనాలు వచ్చాయి. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం గందరగోళ స్థితిలో ఉన్నా డయానా పోర్ట్రెయిట్ సిట్టింగ్‌కు కట్టుబడి ఉండగలిగింది. అందుకే ఈ పెయింటింగ్ ఆమె 'బయటి వ్యక్తిత్వం'తో పాటు 'ఇన్నర్ పర్సన్'‌ను రెండింటినీ గొప్పగా ప్రదర్శించింది.

Advertisement

Next Story