సోషల్​ మీడియా వేదికగా అధికార పార్టీలో 'పీకే' సర్వేలు.. పోటాపోటీగా పోస్టులు

by Javid Pasha |
సోషల్​ మీడియా వేదికగా అధికార పార్టీలో పీకే సర్వేలు.. పోటాపోటీగా పోస్టులు
X

దిశ, ఖమ్మం రూరల్​ : పాలేరు నియోజకవర్గం 2018 జనరల్​ ఎలక్షన్​లో టీఆర్​ఎస్​ పార్టీ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలవగా కాంగ్రెస్​ పార్టీ నుంచి కందాల ఉపేందర్​రెడ్డి బరిలో నిలిచి తుమ్మలపై విజయం సాధించారు. గెలిచిన కొంత కాలంలోనే అధికార పార్టీ కండువాను కప్పుకున్నారు. అప్పటి వరకు నియోజకవర్గంలో తుమ్మల వర్గమే ఉండగా మారిన పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గంలో తుమ్మల–కందాల గ్రూప్​లుగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇద్దరు నాయకులు ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది.

దానిలో భాగంగానే ప్రశాంత కిషోర్​(పీకే) టీమ్​ను రాష్ట్రంలో దింపి ఎమ్మెల్యేలకు తెలియకుండా రహస్య సర్వే జరిపినట్లు సోషల్​ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలోనే పాలేరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డికి ఆశాజనకంగా లేదని తుమ్మల అయితేనే పాలేరు బరిలో గెలుస్తారని సోషల్​ మీడియా వేదికగా తన వర్గ నాయకులు పోస్ట్​ చేస్తున్నారు. అదే స్థాయిలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు సైతం పాలేరు మళ్లి కందాలకే పట్టాం కట్టనున్నట్లు పీకే–కందాలతో కూడిన చిత్రాలను పోస్ట్​ చేస్తున్నారు.

అసలు పీకే రిపోర్టులో ఏముంది..?

అసలు పాలేరు పీకే సర్వే చేశారా..? చేస్తే ఎవరికి అనుకూలంగా వచ్చిందనేది ఇంత వరకు కచ్చితంగా ఎవరికి తెలియని విషయం. ఒక వేళ సర్వే జరిగితే సర్వే ఫలితాలు సీఎం కేసీఆర్​కే తెలిసి ఉంటాయి. సీఎం చెబితేనే ఎవరికి అనుకూలంగా ఉందనే విషయం తెలుస్తుంది. లేదా పీకే ఏమైనా బహిరంగంగా కానీ, మీడియా వేదికగా కూడి ఏమీ ప్రకటించలేదు. ఇరువర్గాలకు చెందిన అభిమానులు, నాయకులు సంయమనం పాటించి సర్వే రిపోర్టు వెలువడిన తర్వాతే పోస్ట్​లను షేర్​ చేస్తే బాగుంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే కందాల–తుమ్మల వర్గాలకు చెందిన నాయకులు సోషల్​ మీడియా వేదికగా తమ నాయకులకే టీఆర్ఎస్​ పార్టీ నుంచి సీటు వస్తుందని గెలవడం పక్కా అని పోస్టులు పెడుతుండటం గమనార్హం. పాలేరు అడ్డా.. కందాల అడ్డా అంటూ కందాల అభిమానులు సైతం సోషల్​ మీడియాలో పోస్ట్​లను షేర్​ చేస్తున్నారు. తుమ్మల వర్గానికి చెందిన నాయకులు సైతం అభివృద్ధి కావాలంటే తుమ్మల రావాలంటూ పోటాపోటీ పోస్ట్​లను షేర్​ చేస్తున్నారు.

పోటాపోటీగా పోస్టులు

కేవలం అనతికాలంలోనే పాలేరు అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని పాలేరులో నిలబడే అర్హత నాకే ఉందని మాజీ మంత్రి తుమ్మల అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే కందాల సైతం పాలేరు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని, అభివృద్ధిని కూడా చేశానని సీఎం కేసీఆర్​ ఆశీస్సులు సైతం కందాలకే ఉన్నాయని తన వర్గీయులు సోషల్​ మీడియా వేధికగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ సారి టీఆర్ఎస్​ నుంచి తుమ్మలకు సీటు వచ్చిన రాకపోయిన నిలబడేది ఖాయం అని తుమ్మల వర్గీయుల మాట. ఇక కందాల వర్గీయులు కూడా సిట్టింగ్​ సీటు మాదే అని, గెలుపు కూడా మా వైపే ఉంటుందని సోషల్​ మీడియాలో పోటాపోటీ పోస్ట్​లు షేర్​ చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ ఆశీస్సులు, పీకే సర్వేలు ఏముందో మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed