కన్నీళ్లు పెట్టుకుంటున్న నర్సులు.. మీరే దిక్కంటూ హరీశ్ రావుకు వేడుకోలు!

by GSrikanth |   ( Updated:2022-03-29 00:30:38.0  )
కన్నీళ్లు పెట్టుకుంటున్న నర్సులు.. మీరే దిక్కంటూ హరీశ్ రావుకు వేడుకోలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​స్టాఫ్​నర్సులకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఏళ్ల తరబడి ఇదే విధానంతో నెట్టుకొస్తున్నది. రెగ్యులర్​ఎంప్లాయిస్‌తో సమానంగా పనిచేస్తున్నా, ప్రసూతి సెలవులు ఇవ్వకుండా పేమెంట్​కట్​చేయడంతో వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్, సూపరింటెండ్లకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. డైరెక్టర్ కనీసం నర్సుల సమస్యలను వినేందుకు కూడా అవకాశం ఇవ్వరని స్టాఫ్ నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించినోళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నిమ్స్​ ఉన్నతాధికారులు బెదిరించడం గమనార్హం. ఇదే విషయాన్ని గతంలో నిమ్స్​విజిట్‌కు వచ్చిన మంత్రి హరీష్​రావు దృష్టికి తీసుకువెళ్లాలని కొందరు కాంట్రాక్ట్​స్టాఫ్​నర్సులు ప్రయత్నించగా, ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపి సదరు నర్సులను మంత్రిని కలవనీయలేదు. గడిచిన ఆరు నెలలుగా ఇదే అంశంపై స్టాఫ్​నర్సులంతా గళం విప్పు తున్నారు. అయినా నిమ్స్​యాజమాన్యం సమస్యలను లైట్​ తీసుకుంటున్నది. దీంతో చేసేదేంలేక గతవారం రోజుల నుంచి నిమ్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆసుపత్రి ముందు ధర్నాలు నిర్వహించారు. డైరెక్టర్ ధర్నా మందు నుంచి వెళ్తున్నారే తప్పా, నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని కనీసం ఆరా కూడా తీయడం లేదని నర్సులు వాపోతున్నారు. దీంతో నిమ్స్ కాంట్రాక్ట్​స్టాఫ్ నర్సులంతా సోమవారం నుంచి పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించారు.

రూల్స్ ప్రకారం వేతనాలు లేవ్..

నిమ్స్ ఆసుపత్రిలో 423 మంది స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. కానీ, వారికి అటానామస్ రూల్స్ ప్రకారం యాజమాన్యం వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టింపు లేకుండా పోయిందని నర్సులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పైగా ప్రస్తుతం ఇస్తున్న పేమెంట్‌కు పే స్లిప్‌లు కూడా లేవు. దీంతో అత్యవసర సమయాల్లో లోన్లు తీసుకోవడం స్టాఫ్​నర్సులు ఇబ్బందికరంగా మారింది.

ఆరు నెలలకోసారి బ్రేక్..

ప్రస్తుతం కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ప్రతీ ఆరు నెలలకోసారి బ్రేక్​చేస్తూ, కొత్త స్టాఫ్‌గా మళ్లీ పాత వాళ్లనే విధుల్లోకి తీసుకుంటున్నారు. దీని వలన ఎంతోమంది సీనియారిటీ లాస్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారనేది అధికారుల్లోనూ క్లారిటీ లేదు. మరోవైపు సీనియారిటీ ప్రకారం ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్నోళ్లకు పర్మినెంట్​ చేయాలనే విజ్ఞప్తిని నిమ్స్ ఉన్నతాధికారులు చెత్త బుట్టలో వేసినట్లు స్టాఫ్ నర్సులు విమర్శిస్తున్నారు. తాము పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా ప్రయత్నిస్తుంటే, నిమ్స్ ఆఫీసర్లు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని నర్సులు మండిపడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు ప్రత్యేక చొరవ తీసుకొని నిమ్స్ కాంట్రాక్ట్ నర్సుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed