ఇసుక మాఫియాను ఎప్పుడు బంధు చేస్తారు..? ఎంపీ, ఎమ్మెల్యేలు ఫైర్

by Satheesh |
ఇసుక మాఫియాను ఎప్పుడు బంధు చేస్తారు..? ఎంపీ, ఎమ్మెల్యేలు ఫైర్
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని జెడ్పీ సర్వసభ్యుల సమావేశంలో ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీలోని మీటింగ్ హాల్లో జెడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ హాజరయ్యారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్, తెలకపల్లి ఎంపీపీ కొమ్ము మధు తదితరులు పాల్గొని నాగర్ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ఇసుక మాఫియాపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇసుక పాలసీని అమలు చేసి పేదలకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని జెడ్పీ సభ సాక్షిగా ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ కొంతమంది అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఇసుక పాలసీ అమలు చేయకుండా అడ్డుపడుతున్నారని పరోక్షంగా జిల్లాలో ఉన్న ఓ ఎమ్మెల్యేపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


రాత్రికి రాత్రే టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక పాలసీ అమలు చేస్తున్నట్లు చెప్పుకున్న ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాగా ఈ సమావేశానికి మైనింగ్ శాఖ అధికారి విజయరామ రాజు హాజరు కాకపోవడంతో మండిపడ్డారు. జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీని వేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అదనపు కలెక్టర్ మన చౌదరి జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తదితర పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనివార్య కారణాల వల్ల హాజరు కాలేనని చెప్పడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed