బాసరలో మంత్రుల పర్యటన.. ఆ ఘనత వారిదే అన్న హరీష్ రావు

by Anukaran |
బాసరలో మంత్రుల పర్యటన.. ఆ ఘనత వారిదే అన్న హరీష్ రావు
X

దిశ, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని గురువారం మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శరత్ పాఠక్ ప్రజాప్రతినిధులు, అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ముందుగా మంత్రి తన్నీరు హరీష్ రావుకు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక కుంకుమార్చన పూజల అనంతరం హారతి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ వైదిక బృందం మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో అమ్మవారి ప్రతిమతో పాటు అభిషేక ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం హరీష్ రావును ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం బాసర రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ చౌక్‌లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణ అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అడవుల పునరుద్ధరణ కార్యక్రమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగిందంటే ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డికే దక్కుతుందని అన్నారు. బాసర జంక్షన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని, పరిపాలన, యుద్ధ నైపుణ్యంలో అన్నింటా శివాజీ ఆదర్శమని, ఆయన మత సామర్యాన్ని చాటారని అన్నారు. ఆయన పాలన ప్రజలే ప్రభువులుగా ఉండేదని కొనియాడారు.

శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదని, పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదని గుర్తిచేశారు. స్థానిక యువకులు, గ్రామస్తులు బాసరలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి 24 గంటల్లో అంబులెన్సు బాసరకు వస్తుందని బహిరంగంగా ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బాసర అమ్మవారిని మంత్రి హరీశ్ రావు దర్శనం చేసుకొని, శివాజీ విగ్రహాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బాసర దేవాలయాన్ని ప్రభుత్వం వంద కోట్ల రూపాయాలతో అభివృద్ధి చేయనున్నదని, రాబోయే రోజుల్లో బాసర పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed