Hydra Commissioner: ముందుంటే వదిలేస్తాం.. తర్వాత వస్తే కూల్చుతాం

by Gantepaka Srikanth |
Hydra Commissioner: ముందుంటే వదిలేస్తాం.. తర్వాత వస్తే కూల్చుతాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘హైడ్రా 2024 జులై19 ఆవిర్బవించింది. హైడ్రాకు ముందుగానే భవనాలుంటే వదిలేస్తాం. ఆ తర్వాత నిర్మిస్తే కూల్చుతాం’ అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలం మూసాపేట, ఖైతలాపూర్ పరిధిలోని కాముని చెరువుతో పాటు మైసమ్మ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారని, చెరువులకు అనుసంధానంగా వుండే కాలువల కబ్జాపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కమిషనర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. కాముని చెరువులో మట్టిపోసినవారిని వదిలిపెట్టేది లేదని, చెరువులో నిర్మాణాలు చేపడితే కూల్చి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు.

చెరువు కబ్జాపై స్థానికులు సంఘటితమై.. ఫిర్యాదు చేయడమే కాకుండా.. చెరువును కాపాడడంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తాం అని చెప్పడం చాలా శుభ పరిణామం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. హైడ్రా 2024 జూలైలో ఆవిర్భవించిందని అప్పటికే నివాసం వుంటే ఆ నివాసాల జోలికి హైడ్రా వెళ్ళదని కమిషనర్ చెప్పారు. అయితే ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే సంబంధిత ప్రభుత్వ విభాగాల అనుమతులున్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్లదన్నారు. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఆక్రమ నిర్మాణాలను తొలగిస్తాం అని కమిషనర్ చెప్పారు. కాముని చెరువు, మైసమ్మ చెరువు పరిసరాల్లో నివాసితులు చెరువులు కబ్జా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మైసమ్మ చెరువు పరిసరాలను కమిషనర్ పరిశీలించారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాలువ పనులు పూర్తి చేయకుండా అక్కడ వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మీటర్ల వెడల్పుతో నిర్మించ తలపెట్టిన వరద కాలువను పూర్తి స్థాయిలో వెంటనే నిర్మించాలని నిర్మాణ సంస్థకు సూచించారు. వరద కాలువను మళ్లించడం వల్ల దిగువన వున్న సఫ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలు వర్షా కాలంలో మునిగిపోయాయని స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. వచ్చే వర్షా కాలనికి ఆ ఇబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువుల మధ్య వున్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చూడాలని స్థానిక అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed