సరికొత్త వెర్షన్‌ 'బలెనో' కారును మార్కెట్లో విడుదల చేసిన మారుతీ సుజుకి!

by Web Desk |
సరికొత్త వెర్షన్‌ బలెనో కారును మార్కెట్లో విడుదల చేసిన మారుతీ సుజుకి!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ 'బలెనో' సరికొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. ఇందులో మాన్యువల్ వేరియంట్ ధర రూ. 6.35-8.99 లక్షల మధ్య, ఆటోమెటిక్ రూ. 7.69-9.49 లక్షల మధ్య నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

అత్యాధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్‌పై దృష్టి సారిస్తూ.. కొత్త తరం బలెనో మోడల్‌ను అనేక రకాల ఫీచర్లతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చాం. ప్రీమియం ఇంటీరియర్స్, వాహనదారులకు తగిన భద్రత కల్పించే అంశాలను పరిగణలోకి తీసుకుని వినియోగదారుల కోసం దీన్ని ప్రవేశపెట్టామని మారుతి సుజుకి సీఈఓ, ఎండీ కెనిచి అయుకవా అన్నారు.

కొత్త బలెనో టెక్నాలజీ అభివృద్ధి కోసం కంపెనీ, భాగస్వామ్యం ద్వారా రూ. 1,150 కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. 2015లో మొదటిసారి బలెనో మోడల్ తెచ్చిన తర్వాత దేశీయ మార్కెట్లో మెరుగైన ఆదరణను సాధించింది. వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇప్పుడు సరికొత్తగా మరింత సామర్థ్యంతో ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని ఆయన పేర్కోన్నారు.

కొత్త బలెనో మోడల్‌లో 360 వ్యూ కెమెరా, కనెక్ట్ ఫీచర్స్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే, ఇటీవల ప్రబుత్వం తప్పనిసరి చేసిన 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్ బలెనో లీటర్‌కు 22.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, ఆటోమెటిక్ వెరియంట్ లీటర్‌కు 22.9 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ వివరించింది.

కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించగా, ఇప్పటివరకు 25,000 బుకింగ్‌లు వచ్చాయని మారుతీ సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. బుధవారం నుంచే వినియోగదారులకు కార్ల డెలివరీలను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed