కలెక్టర్ ఆదేశాలను కలెక్షన్లుగా మార్చుకున్న అధికారి

by S Gopi |   ( Updated:2022-03-09 14:00:29.0  )
కలెక్టర్ ఆదేశాలను కలెక్షన్లుగా మార్చుకున్న అధికారి
X

దిశ, ఖమ్మం రూరల్: రూరల్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి మండలానికి చెందిన అధికారులు 'రియల్' గా రూ. లక్షల్లో అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ఒక వైపు నుంచి సాక్షత్తు కలెక్టర్ అక్రమ వెంచర్లపై రిపోర్టు ఇవ్వాలని, అటువంటి వాటిపై కఠినంగా వ్యవరించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. రూరల్ లో పనిచేస్తున్న ఎంపీవో మాత్రం తనకేమీ పట్టనట్లు, కలెక్టర్ ఆదేశాలే తనకు వరంలా మార్చుకుంటూ రూ. లక్షలను సదరు రియల్ వ్యాపారుల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే బోర్డు పాతడం, రోడ్లు తవ్వడం లాంటివి చేయడమే సదురు అధికారి ముఖ్య పని. చేతిలో డబ్బులు పడితే చాలు ఆ వెంచర్ వైపు కన్నేత్తి కూడా చూడడు. అనుకున్న విధంగా పని జరగకపోతే సదురు వ్యాపారి చుక్కలు చూడాల్సిందే. కొంత డబ్బు ముట్టజెప్పినా మిగతావి కూడా వెంటనే ఇవ్వాల్సిందేనంటూ వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పాత వెంచర్ల పైన సైతం సదురు అధికారి పెత్తనం చేలాయించడమే కాకుండా పంచాయతీ కార్యదర్శులకు సైతం ఆదేశాలు జారీ చేయడం, వారిని దారిలోకి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేయడమే వీరి పని.

రూరల్ లో ఓ వెంచర్ నుంచి రూ. 11 లక్షలకు బేరం కూదుర్చుకుని మీకు ఇంటి పర్మీషన్లతో పాటు అన్ని రకాల అనుమతులు ఇస్తామని నమ్మబలకడంతో వారు కొంత మేరకు అంటే రూ.5 లక్షల నగదు అప్పజెప్పారు. కానీ పనికాలేదు. అంతేకాదు వెంటనే బోర్డు పెట్టడమే కాకుండా.. కందకం తవ్వి వెంచర్లో రహదారులను సైతం డిస్టర్బ్ చేశారు. వెంచర్ల మీదికి ఉసిగొల్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీవో వెంచర్ వేసినందుకుగాను రూ.11 లక్షలు డిమాండ్ చేశాడని, కొంత అంటే రూ. 5 లక్షలు ఇచ్చానని మిగతావి కూడా ఇవ్వాల్సిందేనని పనులు ఆపిస్తున్నాడంటూ ఓ రియాల్టర్ 'దిశ'కు తన గోడు వెల్లబోసుకోవడం గమనార్హం.

రూ.5 లక్షలు ఇచ్చినా పనుల అడ్డగింత..

ఖమ్మం రూరల్ మండలంలో ఓ రియల్టర్ 5 ఎకరాల్లో వెంచర్ వేశాడు. దీనికి సంబంధించి అన్ని రకాల పర్మిషన్ల కోసం ఎంపీవో శ్రీనివాసరావుతో రూ.11లక్షలు బేరం కుదుర్చుకున్నాడు. దాంట్లో మొదటి విడతగా రూ.5 లక్షలు ఎంపీవోకు, సదురు కార్యదర్శికి రూ. 2 లక్షలు ఇచ్చినట్లు ఆ రియల్టర్ చెబుతున్నాడు. మిగతా డబ్బుల కోసం అధికారులను పంపించి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పనులు చేయనీయకుండా ఏదో ఒకటి చెబుతూ అడ్డుతగులుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రియల్టర్ కు సంబంధించి వెంచర్ లో పనులు చేస్తుంటే.. స్థానిక అధికారులు వెళ్లి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు వారితో వాగ్వాదానికి దిగినట్లుగా కూడా సమాచారం. అదే సమయంలో బాధితుడు సుడా చైర్మన్ కు ఫోన్ చేసి 'డబ్బులు ఇచ్చినా పనులు ఆపేస్తున్నారని.. తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో తర్వాత మాట్లాడుతానంటూ..' ఫోన్ కట్ చేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం ఆ వివాదంలో కోర్టు కేసు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమ దగ్గర నుంచి రూ. లక్షలకు లక్షలు డిమాండ్ చేస్తున్నారని.. కొంత డబ్బులు ఇచ్చినా మిగతా వాటికోసం వేధింపులు ఆగడం లేదంటూ రియల్టర్లు వాపోతున్నారు.

ఎంపీవో, కార్యదర్శులకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే..

మా నుంచి ఎంపీవో శ్రీనివాసరావు, కార్యదర్శి సాయి డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. మాది పాత వెంచరే అయినప్పటికీ కావాలనే మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి, అన్ని రకాల అనుమతులు ఇస్తాం అని చెప్పి మా నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మొదటి దఫా కిందా ఎంపీవోకు రూ.5 లక్షలు, కార్యదర్శికి రూ.2 లక్షలు ఇచ్చాం. అయినా సరే మా వెంచర్లో బోర్డు పాతడమే కాకుండా రోడ్లను కూడా తవ్వించడం చాలా బాధాకరం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం.

-ఖాదర్, రియల్ వ్యాపారి

Advertisement

Next Story