మ‌ళ్లీ ప‌డ‌గ విప్పిన 'గుడుంబా'

by S Gopi |
మ‌ళ్లీ ప‌డ‌గ విప్పిన గుడుంబా
X

దిశ‌, మ‌రిపెడ: మ‌హ‌బూబాబాద్ జిల్లాలో మ‌ళ్లీ గుడుంబా మ‌హ‌మ్మారి ప‌డ‌గ విప్పుతోంది. మ‌హ‌బూబాబాద్‌, డోర్నక‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌లు గ్రామాలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, చిత్తూరుల నుంచి పెద్ద మొత్తంలో గుడుంబా దిగుమ‌వుతోంది. ఫ‌లితంగా గ‌త కొద్దిరోజులుగా మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని వ్యవ‌సాయ క్షేత్రాలు, అట‌వీ ప్రాంతాలు గుడుంబా త‌యారీకి కేంద్రాలుగా మారుతున్నాయి. అనేక తండాల్లో గుడుంబా విక్రయాలు పెర‌గ‌డ‌మే ఇందుకు నిద‌ర్శన‌మ‌ని చెప్పాలి. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపింది. గుడుంబా తయారీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాపారులు, తయారీదారులపై ఎక్సైజ్‌శాఖ పీడీయాక్ట్‌ నమోదు చేసింది. దీంతో జిల్లాలో గుడుంబా తయారీ పూర్తిగా బందయింది. అయితే గ‌డిచిన కొద్ది కాలంగా మ‌ళ్లీ గుడుంబా పురివిప్పుతోంది.

ఆంధ్రా నుంచి మ‌హ‌బూబాబాద్ జిల్లాకు..

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, చిత్తూరు నుంచి బెల్లం మహబూబాబాద్ జిల్లాలోని కేస‌ముద్రం, మ‌రిపెడ‌, కుర‌వి, మ‌హ‌బూబాబాద్ మండ‌లంలోని ప‌లు గ్రామాల‌కు ఎక్కువ‌గా స‌ర‌ఫ‌రా అవుతోంది. మరిపెడ మండ‌లంలోని ఎల్లంపేట స్టేజి, నరసింహుల పేట స్టేజ్ లల్లో రాత్రి వేళలో పెద్ద మొత్తంలో నల్ల బెల్లం, పట్టిక దిగుమతవుతోంద‌ని స‌మాచారం. అక్కడ బహిరంగ మార్కెట్‌లో క్వింటా ధర మూడు వేల రూపాయలుగా ఉంటే ఇక్కడ‌కు అదే బెల్లం క్వింటా రూ. 8000కు అమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్క క్వింటాపై దాదాపు మూడు రెట్ల లాభాలు ఉండటంతో ఈ వ్యవహారంలో పాలుపంచుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అక్రమ పద్ధతిలో బెల్లం అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఎక్సైజ్, పోలీసు అధికారులు బెల్లం మాఫియాలో ఉన్న ప్రధాన సూత్రదారులను పెద్దగా ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా గుప్పు మంటోంది.

ఉదాసీన‌త‌...

ఎక్సైజ్‌ అధికారుల ఉదాసీనత వైఖరి కారణంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ‌రిపెడ మండ‌లంలోని ప‌లు తండాలు, కేస‌ముద్రం, కుర‌వి, డోర్నక‌ల్‌, మ‌హ‌బూబాబాద్ మండ‌లంలోని గ్రామాల్లో రోజుకు 2వేల లీటర్ల గుడుంబా వ్యాపారం జరుగుతోందని స‌మాచారం. పలు గ్రామాలు, గిరిజన తండాలలో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోంది. గుడుంబా తయారీని మానేసినవారికి పునరావాసం కింద ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. అయినా చాలామందిలో మార్పు రావడంలేదు. గుడుంబా దందా చేస్తే అంతకంటే ఎక్కువే సంపాదిస్తామనే ధోర‌ణితో కొంత‌మంది త‌మ తీరును మార్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. నల్లబెల్లం వ్యాపారులే గుడుంబా తయారీదారులకు అండగా నిలిచి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలకాలంలో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన దాఖలాలు తక్కువే. నల్లబెల్లం నిల్వ కేంద్రాల సమాచారాన్ని సేకరించి, ఆయా రహస్య గోదాములను సీజ్‌ చేసిన సందర్భాలూ అరుద‌నే చెప్పాలి.

అధికారుల అండదండలు

బెల్లం, పటిక అమ్మకాల విషయంలో వ్యాపారులకు సంబంధిత అధికారుల అండదండలు పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్సైజ్‌ శాఖ నామమాత్రంగా దాడులు నిర్వహించి చిన్నచితక కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. బెల్లం, పటిక వ్యాపారం జరుగుతున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బెల్లం, పటిక అమ్మకాలను అరికట్టడంతోపాటు గుడుంబాకు కరుగుతున్న బడుగుల జీవితాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని ప్రజ‌లు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed