ప్ర‌భుత్వ‌ టీవీ ఛాన‌ల్లో దొంగ‌త‌నం ఎలా చేయాలో ప్రోగ్రామ్‌.. అంద‌రి మైండ్ బ్లాక్‌!

by Sumithra |
ప్ర‌భుత్వ‌ టీవీ ఛాన‌ల్లో దొంగ‌త‌నం ఎలా చేయాలో ప్రోగ్రామ్‌.. అంద‌రి మైండ్ బ్లాక్‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచంలో కంటిన్యూగా జ‌రుగుతున్న యుద్ధాల కోసం ఇంధ‌నం ఎలా స‌మ‌కూరుతుందో గానీ, అంత‌ర్జాతీయంగా వివిధ దేశాల్లో సామాన్య ప్ర‌జ‌లు పెట్రోల్, డీజిల్ దొర‌క్క తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కుంటున్నారు. ఈ క్ర‌మంలోనే, ఇటీవ‌ల‌ గ్రీస్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. అది స‌రే, అయితే, కార్ల నుండి ఇంధనాన్ని ఎలా దొంగిలించాలో నేర్పిస్తూ ఏకంగా గ్రీస్ స్టేట్ టీవీ ఒక ప్రోగ్రామ్ చేసేసింది. ERT ఛానల్ త‌న‌ మార్నింగ్ న్యూస్ ప్రోగ్రాం 'సిండెసీస్‌'లో ఛాన‌ల్‌ స్టేషన్ రిపోర్టర్ కోస్టాస్ స్టామౌ దీన్ని రిపోర్ట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా రిపోర్టర్ ఇంధ‌నం దొంగ‌త‌నం చేయ‌డం చాలా సులువైన ప‌ని అని చెప్పాడు. "ఇది అంత‌ సంక్లిష్టమైన విషయం కాదు. దీని కోసం మీకు ప్రత్యేక ట్యూబ్ కూడా అవసరం లేదు. బాల్కనీల్లో ఉండే గొట్టం కూడా పని చేస్తుంది" అని స‌ల‌హాలిచ్చాడు.

ఈ ప్రోగ్రామ్‌లో ప్రాక్టిక‌ల్‌గా చూపించ‌డానికి ఒక కారు రిపేర్‌మ్యాన్‌ని కూడా తీసుకొచ్చారు. అత‌డు కారులోని ట్యాంక్‌కు గుచ్చి, ఇంధ‌నం దొంగిలించాల్సి ప్రాంతాన్ని వివ‌రంగా చెప్పాడు. ఈ క్ర‌మంలో దొంగ‌త‌నానికి రెండు పద్ధతులను తెలియ‌జేశారు. మొత్తానికి ఈ కార్య‌క్ర‌మం ఛాన‌ల్ అనుకున్న‌ట్లే చ‌క్క‌గా వ‌చ్చింది. అయితే, ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్ష‌కులు షాక్ తిన్నారు. "మీకస‌లు జ్ఞానం ఉందా..? గ్యాసోలిన్ దొంగిలించడానికి ప్రజలకు చిట్కాలు ఇస్తున్నారా?" అని ట్విట్టర్‌లో ఒక వినియోగదారు మండిప‌డ్డారు. మరొక వ్యక్తి , "గ్యాసోలిన్‌ను సులభంగా దొంగిలించడానికి చెప్పిన ట్యుటోరియల్ తర్వాత, తాళాలు తెరవడం, వాలెట్‌లను ఎలా దొంగిలించాలో ERT కొత్త 'హౌ-టు'ల‌ను ప్ర‌సారం చేస్తోంది" అంటూ సైటైర్లు వేశారు.

కొన్ని నెల‌లుగా గ్రీస్‌లో ఇంధన ధరలు పెరుగుతున్న నేప‌ధ్యంలో ఈ సంద‌ర్భం ఏర్ప‌డింది. ఇప్పుడు, సాధారణ అన్‌లెడెడ్ ఇంధనం ఏథెన్స్‌లో సగటున లీటరుకు దాదాపు రూ.200 కాగా, ఇతర పొరుగు ద్వీపాలలో ఇంకాస్త‌ ఎక్కువగా ఉంది. ఇక‌, ఇంధనంపై పన్ను తగ్గించాలన్న ప్ర‌జ‌ల డిమాండును అధికారులు ప్రతిఘటిస్తున్నారు. ప్ర‌భుత్వం భారాన్ని తగ్గించడానికి బ‌దులుగా సబ్సిడీలు ప్ర‌క‌టిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed