ఉచితాలను మేము నియంత్రించలేము: కేంద్ర ఎన్నికల సంఘం

by Manoj |
ఉచితాలను మేము నియంత్రించలేము: కేంద్ర ఎన్నికల సంఘం
X

న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత ఉచితాలను అందించడం రాజకీయ పార్టీ విధాన నిర్ణయమని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మేము నియంత్రించలేమని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి శనివారం ఈసీ దేశ అత్యున్నత స్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉచితాలను ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆ రాజకీయ పార్టీ పంపిణీకి నిర్ణయం తీసుకోవచ్చు. అది ఆ పార్టీ యొక్క విధాన నిర్ణయం. అవి ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయా? లేదా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. ఉచితాల వలన రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతుంది. అది ప్రతికూల సంకేతాలను సూచిస్తుంది. ఇటువంటి సమయంలో ఉచితాలను పొందాలా వద్ద అనే విషయాన్ని రాష్ట్ర ఓటర్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ తీసుకునే నిర్ణయాలను ఎన్నికల సంఘం నియంత్రించలేదు. చట్టంలోని నిబంధనలను మార్చకుండా అలాంటి చర్యలు చేపడితే నిబంధనల ఉల్లంఘనే అవుతుంది.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ -2002 విషయంలో సుప్రీంకోర్టు వివరించిన 3 కారణాలపై తప్ప రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసే అధికారం తమకు లేదని ఈసీ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల రిజిస్టర్‌ను రద్దు చేసే అధికారాన్ని చట్ట మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేసిందని, రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్, డీ-రిజిస్ట్రేషన్‌ను నియంత్రిస్తూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఈసీ అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలను పంపిణీ చేయకుండా నిరోధిస్తే పార్టీలు తమ గుర్తింపును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌కు ప్రతిస్పందనగా ఈసీ ప్రతిస్పందన అఫిడవిట్ దాఖలు చేసింది. రాజకీయ పార్టీల వాగ్దాలను తాము నిరోధిస్తే ఎన్నికల ప్రక్రియ యొక్క స్వచ్ఛతను దెబ్బతీస్తుందని అఫిడవిట్ స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు ప్రజానిధుల నుంచి ప్రజా ప్రయోజనాల కోసం లేని అహేతుకమైన ఉచితాల వాగ్దానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 162, 266(3), మరియు 282లను ఉల్లంఘిస్తోందని అశ్విని కుమార్ పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరగా.. జనవరి 25న దీనిపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకు పూర్తివివరాలతో కూడిన అఫిడవిట్‌ ద్వారా ప్రతిస్పందన తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed