- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలు.. 'దిశ' ప్రత్యేక కథనం
దిశ, ప్రతినిధి, వరంగల్ : కాకతీయుల పాలనలో శైవం వర్ధిల్లింది. శివుడిని ఆరాధించడంతో పాటు అనేక శైవలయాలను నిర్మించి పరమాత్ముడిపై భక్తిని చాటుకున్నారు. వారి శివభక్తికి నేటికీ ఓరుగల్లు ప్రాంతంలోని ఆలయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, కటాక్షాపూర్‌లోని శివాలయం, ఓరుగల్లు కోటలోని కాశీ విశ్వేశ్వరాలయం, కాళేశ్వరంలోని ముక్తిశ్వరాలయం ప్రసిద్ధి చెందినవి. వాస్తవానికి కాకతీయులు శైవారాధకులే అయినా.. వైష్ణవ ఆలయాలను సైతం నిర్మించి ఆధ్మాత్మిక సమానత్వాన్ని చాటుకున్నారు.
శైవ ఆలయాల ఖిల్లాగా ఓరుగల్లు
కాకతీయులు కళలకు పట్టం కట్టారు. సంగీతం, సాహిత్యం, నృత్యం.. అన్నింటినీ సమానంగా ఆదరించారు. ముఖ్యంగా కాకతీయ రాజుల ప్రోత్సాహంతో వికసించిన కాకతీయ శిల్పం.. ఓ శిల్పరీతిగా విశిష్టత సంతరించుకుంది, అందుకే కాకతీయ యుగంలో సాహిత్యం వర్ధిల్లింది. ఇక కాకతీయ రాజులు శైవ, వైష్ణవ మతాలను సమాన రీతిలో ఆదరించారు. ఆలయాలను నిర్మించారు. ఇక కాకతీయ శిల్పకళా సంపదకు ప్రతిభకు.. నిర్మాణ శైలికి తార్కాణం రామప్ప, వేయిస్తంభాల ఆలయాలు. వేయిస్తంభాల ఆలయాన్ని కాకతీయ మహారాజు రుద్రదేవమహారాజు క్రీ.శ 1084లో దీనిని నిర్మించాడు. ఇది నిజానికి త్రికూటాలయం.
కటాక్షపురంలో శివకేశవాలయాలు
ఒకే వేదిక మీద మూడు దిక్కుల మూడు ఆలయాలను నిర్మించారు. అవి రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవాలయాలు. కాకతీయులు నిర్మించిన అతి పురాతన శైవ క్షేత్రాలు హన్మకొండకు 27కిలోమీటర్ల దూరంలోని కటాక్షపురంలో శివకేశవాలయాలున్నాయి. ఇవి రెండు త్రికూటాలయాలు. కాకతీయ సామంతులు వీటిని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వార తెలుస్తోంది. విశాలమైన స్థలంలో 7 అడుగుల ఎత్తున వేదికపై వీటిని నిర్మించారు. లోపల నృత్య మండపం, మూడు వైపుల మూడు ఆలయాలు ఉంటాయి. ఆత్మకూరు గ్రామంలో పంచకూట ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీశ.1250నాటి కంఠాత్మకూరు శాసనంలో దీనిని భీమదేవర ఆలయంగా పేర్కొంటారు. యూ ఆకారంలో ఉన్న ఈ ఆలయం మధ్యలో ఉన్న ప్రధాన శివాలయానికి కుడి దిక్కున రెండు, ఎడమ దిక్కున రెండు శివలింగాలున్న గర్భాలయాలున్నాయి. విశేషమేమిటంటే ఇందులోని శివలింగాలన్నీ ఏ మాత్రం తేడా లేకుండా ఒకే విధంగా ఉన్నాయి. ఇందులో ప్రధాన ఆలయంలో ఉండాల్సిన శివలింగం ప్రస్తుతం లేదు.
ఉమ్మడి జిల్లాలో అనేక ప్రసిద్ధ ఆలయాలు..
వరంగల్ కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం కూడా కాకతీయు కాలం నాటిదే. కాకతీయులలో చివరివాడైన ప్రతాపరుద్ర చక్రవర్తి దీనిని నిర్మించాడు. కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయం, బచ్చన్నపేట మండలం కొడవటూరులోని సిద్ధేశ్వరాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం , పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, మెట్టుగుట్టపై ఉన్న రామలింగేశ్వరాలయాలే కాదు ఇలా పదుల సంఖ్యలోని శైవ క్షేత్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి.