- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా పేషెంట్ల వైద్యంపై మంత్రి హరీష్‌రావు కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : జిల్లా పేషెంట్లకు ఎక్కడికక్కడే వైద్యం అందివ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతేనే హైదరాబాద్‌కు రిఫర్ చేయాలన్నారు. లేకపోతే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్లపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లా దవాఖాన్లలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అతి త్వరలో రోగులకు ఇబ్బందులు లేకుండా మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు ఆర్ధోపెడిక్ వైద్యులతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్ సేవల గురించి ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన నూతన వైద్య విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని ఆసుపత్రులకు తగినంత బడ్జెట్ ఇచ్చామన్నారు. ఆసుపత్రుల డెవలప్‌మెంట్ కోసం ఆరోగ్య శ్రీ కింద నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నిధులను వినియోగించుకొని సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ప్రైవేట్‌తో పోటీ పడాలి....
ప్రైవేట్ హాస్పిటల్స్ లతో పోటీ పడి ప్రభుత్వ హాస్పిటల్స్ లో అర్ధోపెడిక్ వైద్య సేవలు అందించాలని సూచించారు. మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వాసుపత్రుల్లో సమకూర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగేలా చూడాలన్నారు. దీని వల్ల పేద ప్రజలకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు. సూపరింటెండెంట్స్ అర్ధోపెడిక్ వైద్యులకు సహకారం అందించాలన్నారు. అన్ని రకాల ఆర్థోపెడిక్ చికిత్సలకు ఆరోగ్య శ్రీ పథకం కింద అవకాశం ఉన్నదని మంత్రి గుర్తు చేశారు.
రివ్యూలు తప్పనిసరి....
సూపరింటెండెంట్లు, డైరెక్టర్లు సంబంధిత విభాగాల డాక్టర్లు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధిపై చర్చ జరగాలన్నారు. చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావాలన్నారు. ఆసుపత్రి అధికారుల పరిధిలో లేని వాటిని మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వైద్యానికి బడ్జెట్ ఇచ్చామన్నారు. వైద్య పరికరాలకు రూ.500 కోట్లు, సర్జికల్‌కు రూ.200 కోట్లు, పరీక్షలకు రూ.300 కోట్లు, మందులకు రూ.500 కోట్లు, ఆసుపత్రుల అభివృద్ధికి రూ.1250 కోట్లు కేటాయించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి, నిమ్స్, రిమ్స్, మహబూబ్‌నగ్, సిద్ధిపేట్ దవాఖానాల డైరెక్టర్లు, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.