ఎవరెస్ట్‌పై పార్టీ.. ప్రపంచంలోనే ఎత్తయిన 'టీ పార్టీ'గా రికార్డ్

by Javid Pasha |   ( Updated:2022-03-17 08:03:38.0  )
ఎవరెస్ట్‌పై పార్టీ.. ప్రపంచంలోనే ఎత్తయిన టీ పార్టీగా రికార్డ్
X

దిశ, ఫీచర్స్ : సీటెల్‌కు చెందిన సాహసికుడు ఆండ్రూ హ్యూస్, అతడి క్లైంబింగ్ టీమ్‌తో కలిసి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్-2లో సముద్ర మట్టానికి 21, 312 అడుగుల ఎత్తున టీ పార్టీని నిర్వహించి అరుదైన ఫీట్ సాధించాడు. గతేడాది నిర్వహించిన ఈ పార్టీని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టీ పార్టీగా తాజాగా గిన్నిస్‌ బుక్ గుర్తించింది. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన అథ్లెట్ ఆండ్రూ హ్యూస్, తన సహచరులతో కలిసి మే 5, 2021న ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. తనకు 2020లోనే వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే ఆలోచన వచ్చినప్పటికీ పాండమిక్ కారణంగా తన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

ప్రకృతి ప్రదేశాలు, పర్వతాలతో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్న హ్యూస్.. తిరిగి వాటితో కనెక్ట్ అయ్యే క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎవరెస్ట్‌పై 'టీ పార్టీ' నిర్వహించాడు. అతడు భావించినట్లుగానే ఈ ఫీట్ గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేసింది. 'పాండమిక్ కారణంగా ప్రపంచం ఆగిపోయినప్పుడు పర్వతారోహణకు వీలు లేకుండా పోయింది. ప్రకృతితో కనెక్షన్ తెగిపోవడంతో ఒంటరితనం ఆవహించింది.

ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టే దిశగా ఎవరెస్ట్‌పై తొలిగా 'టీపార్టీ' నిర్వహించాం. ఈ రికార్డును నెలకొల్పడం అంత సులభమేం కాదు. మా టీమ్ రికార్డ్ కోసం సిద్ధమవుతున్నప్పుడు భారీ తుఫాన్ క్యాంప్ 2ను తాకింది. హిమపాతాలు కరగడం ప్రారంభించాయి. ఆ విపత్తులను తట్టుకుని మేము సెలబ్రేట్ చేసుకున్న అపూర్వ క్షణాలవి' అని హ్యూస్ అన్నాడు.

Advertisement

Next Story