CM KCR: రైతులతో పెట్టుకుంటే తట్టుకోలేవ్.. ఢిల్లీ గడ్డమీద గర్జించిన కేసీఆర్

by GSrikanth |   ( Updated:2022-04-11 11:47:59.0  )
CM KCR: రైతులతో పెట్టుకుంటే తట్టుకోలేవ్.. ఢిల్లీ గడ్డమీద గర్జించిన కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పండిన ప్రతిధాన్యపు గింజనూ కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. రైతులతో పెట్టుకుంటే తట్టుకోలేరని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిస్తే ఆయన వ్యవహరించిన తీరు బాగోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని చెప్పి అవమానపరిచారంటూ ఆరోపించారు. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణలో పండిన పంటను ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఆయన పీయూష్ గోయల్ కాదని పీయూష్ గోల్ మాల్ అంటూ విమర్శించారు. తెలంగాణలోని రైతులకు ఎంతో చేశామని, వారికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూన్నామని ఇరిగేషన్ వ్యవస్థలను బాగుచేశామని పేర్కొన్నారు. రైతుల పోరాటంతో టికాయత్‌కు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు మద్దతుగా ఉంటారని ప్రకటించారు.

కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. ఎన్నికలు వస్తేనే మోడీకి రైతులు గుర్తుకొస్తారని, దేశంలో రైతుల కోసం కొత్త పాలసీని తీసుకురావాలని, లేకపోతే పార్టీలను ఏకం చేసి రైతుల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. బీజేపీలో అందరు సత్య హరిచంద్రులు ఉన్నారా అని ఇతర పార్టీల వారు ప్రశ్నిస్తే మాత్రం ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ఈ బీజేపీ పార్టీ కుక్కలు ఈడీ రైడ్స్ జరిపి సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని రాష్ట్రంలో మొరుగుతున్నారని, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ సవాల్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రెండు చేతులతో దండం చేసి అడుతున్నా అన్ని రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు జరిపినట్లు తెలంగాణలో కూడా కొనుగోళ్లు జరపండి అని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed