Chandrababu Naidu: పసి బిడ్డలతో మండుటెండలో ఉన్న వారి అవస్థలు కనిపించడం లేదా? చంద్రబాబు ఫైర్..

by Satheesh |   ( Updated:2022-04-12 11:04:23.0  )
Chandrababu Naidu: పసి బిడ్డలతో మండుటెండలో ఉన్న వారి అవస్థలు కనిపించడం లేదా? చంద్రబాబు ఫైర్..
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల తోపులాటలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆడవాళ్లు, పిల్లలు, వృద్దులు క్యూలైన్లలో పడుతున్న అవస్థలు టీటీడీకి పట్టవా అని చంద్రబాబు నిలదీశారు. భక్తుల రాక, రద్దీ గురించి కనీసం అవగాహన లేకుండా టీటీడీ వ్యవహరించడం బాధాకరమన్నారు. సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్‌లో తీవ్ర తొక్కిసలాట జరగడం, పలువురు భక్తులు గాయపడడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

వేలాది మంది భక్తులు వస్తుంటే.. వారికి కనీసం తాగునీటి సదుపాయం, క్యూ లైన్లలో నీడ కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. శ్రీవారి భక్తులపై ఇంతటి నిర్లక్ష్యమా అని టీటీడీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి టీటీడీ నిర్ణయాలు శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని.. సామాన్య భక్తుల దర్శనాలు, వసతి వంటి అంశాల్లో మొదటి నుంచి ఇదే తరహా అలసత్వం టీటీడీలో కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలోనే టీటీడి చూస్తుందని.. కొండపైకి వెళ్ళడానికి కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటనపై శ్రీవారి భక్తులకు టీటీడీ క్షమాపణలు చెప్పి.. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story