శిలా నేత్రం.. జనగామ జిల్లా, లింగంపల్లి గుట్టపై అరుదైన నిర్మాణం

by Mahesh |
శిలా నేత్రం.. జనగామ జిల్లా, లింగంపల్లి గుట్టపై అరుదైన నిర్మాణం
X

దిశ, ఫీచర్స్ : భూమిపై గుట్టలు ఏర్పడటమే ఒక విశేషమైతే.. శిలా ద్రవం బయటకు ఉబికివచ్చి వాటిపై నల్లటి గీతల వలె డైక్స్, ఖనిజ శిలా ద్రవాలతో కూడిన వీన్స్ ఏర్పడడం మరో విశేషం. అయితే ఇప్పుడు ఓ గుట్టకు ఏర్పడిన రంధ్రం సామాన్యులనే కాక భూగర్భ శాస్త్రవేత్తలను సైతం ఆకర్షిస్తోంది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి తన పురావస్తు పరిశోధనలో భాగంగా జనగామ జిల్లా, చిల్పూర్ మండలం, లింగంపల్లి లోని ఈ అరుదైన రంధ్రాన్ని వెలుగులోకి తెచ్చారు.

లింగంపల్లి గ్రామం లో రంగనాయకుల గుట్ట కు ఏటవాలుగా రెండు దిగుళ్ల మధ్య ఏర్పడిన ఒక రంధ్రాన్ని ఆయన గుర్తించారు. ఇది 17.5538 ఉత్తర అక్షాంశం, 79.15.25 తూర్పు రేఖాంశాల మధ్య 427 మీటర్ల ఎత్తులో ఉంది. భూగర్భ శాస్త్రం ప్రకారం వీటిని 'మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్‌క్లేవ్స్' అంటారు. భూమి అంతర్భాగంలో కొన్ని కిలోమీటర్ల లోతున రెండు రకాల శిలాద్రవాల మధ్య పరస్పర రసాయన, యాంత్రిక, ఉష్ణ మార్పులు జరగడం వల్ల ఈ 'మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్‌క్లేవ్స్(MME) ఏర్పడతాయి. రెండు రకాల శిలా ద్రవాల్లో ఒకటి 'మాఫిక్'. ఇందులో ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. రెండోది సిలికా(ఫెల్సిక్ శిలాద్రవం) ఎక్కువ.

పక్క పక్కనే ఏర్పడిన ఎన్‌క్లేవ్స్ చూసేందుకు పెద్ద పెద్ద దిగుళ్ల వలె కనిపిస్తాయి. వీటి మధ్య గాలి తాకిడి, నీటి ప్రవాహాల కోత వలన రంధ్రం ఏర్పడింది. ఇక లింగంపల్లి గుట్టపై ఏర్పడిన రంధ్రం గుండా ప్రకృతిని వీక్షించడం గొప్ప అనుభూతినిచ్చిందన్న పరిశోధకుడు.. ఈ రంధ్రాన్ని 'శిలా నేత్రం' గా అభివర్ణించారు.

Advertisement

Next Story