చెన్నూరు బరిలో వివేక్ మిస్సింగ్.. జాబితాలో కనిపించని ఆయన పేరు!

by GSrikanth |   ( Updated:2023-11-11 10:11:20.0  )
చెన్నూరు బరిలో వివేక్ మిస్సింగ్.. జాబితాలో కనిపించని ఆయన పేరు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి చెన్నూరు అభ్యర్థిగా ఖరారైన గడ్డం వివేక్ వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేయలేదా?.. అక్కడి నుంచి పోటీ చేయడంలేదా?.. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఎందుకు మిస్ అయింది?.. ఇవీ ఇప్పుడు ఆ సెగ్మెంట్‌లో మాత్రమే కాక మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. చివరి నిమిషంలో పార్టీలో చేరినా ఆయన పేరు ఖరారు కావడంతో గెలుపు కూడా తథ్యమనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. నామినేషన్ల గడువు నిన్నటితో (శుక్రవారం) ముగిసిపోయింది. ఆ సెగ్మెంట్‌లో పోటీ చేస్తున్న మొత్తం 23 మంది అభ్యర్థుల పేర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఈరోజు (శనివారం) వెల్లడించింది.

ఆ జాబితాలో గడ్డం వివేక్ పేరు కనిపించడంలేదు. దీంతో ఆయన నామినేషన్ వేశారా?.. వేయలేదా?.. దాఖలు చేసినా ఎలక్షన్ స్టాఫ్ మిస్టేక్ చేసిందా?.. ఆయన పేరును ప్రస్తావించడం మర్చిపోయిందా?.. ఇలాంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో అటు వివేక్ లేదా సీఈఓ ఆఫీస్ స్పందించిన తర్వాతే స్పష్టత రానున్నది. చెన్నూరు టికెట్ ఖరారవుతుందని తెలిసిన వెంటనే ఆయన కుమారుడు వంశీ అక్కడ బైక్ ర్యాలీ నిర్వహించారు. వివేక్ సైతం ప్రచారం చేస్తున్న సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసిపోయిన తర్వాత ఆయన పేరు మిస్సింగ్ కావడంతో ఇప్పుడేం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది.

బీఆర్ఎస్ తరఫున బాల్క సుమన్, బీజేపీ తరఫున దుర్గం అశోక్, బీఎస్పీ తరఫున దాసరపు శ్రీనివాస్, టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్య సమితి) తరఫున వడ్లకొండ రాజం తదితరులతో పాటు మొత్తం 23 మంది పోటీ చేస్తున్నారు. అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఏ అభ్యర్థి పేరూ కనిపించలేదు. గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు కూడా కనిపించలేదు. ఇంతకూ వివేక్ చెన్నూరు బరిలో ఉన్నట్టా?.. లేనట్టా?.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరు? నామినేషన్ల దాఖలులో వచ్చే సాంకేతిక సమస్యలతోనే అభ్యర్థులు రెండు, మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తుంటారు. అయినా వివేక్ పేరు గాయబ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, చెన్నూరులో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో వివేక్ పేరు లేదనే వార్త రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో వివేక్ పేరు మిస్సింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పందించింది. ఈ నెల చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇంకా రెడీ కాలేదని, మరికొందరు క్యాండిడేట్ల పేర్లు చేర్చాలని క్లారిటీ ఇచ్చింది. మిస్ అయిన పేర్లలో మాజీ ఎంపీ వివేక్ పేరు ఉండవచ్చని స్పష్టం చేసింది. దీంతో వివేక్ పోటీపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.




Advertisement

Next Story

Most Viewed