Mallu Bhatti Vikramarka : ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడే ఆ నిర్ణయం తీసుకున్నారు

by GSrikanth |   ( Updated:2023-08-01 09:55:16.0  )
Mallu Bhatti Vikramarka : ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడే ఆ నిర్ణయం తీసుకున్నారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తొమ్మిదిన్నర ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వార్షిక మెయింటేనెన్స్‌కు నిధులు విడుదల చేయకుండా చేసిన నిర్లక్ష్యం ఫలితంగానే వరదలు ముంచెత్తి ప్రజలు అల్లాడిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ బృందం గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల జరిగిన విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ వాస్తవ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు.

భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమయాత్తం చేయకుండా సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ఉన్నందునే ఇంత పెద్ద నష్టం జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు నిర్మాణం అశాస్త్రీయంగా జరగడం వల్ల అనేక ప్రాంతాలు గిరిజన గూడేలు ముంపునకు గురయ్యాయని, మున్నేరు, కిన్నెరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాములు ఇంజినీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి నిర్మాణం చేసి ఉంటే నష్టం జరిగి ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతున్న బాధితులను ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌కి వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు.

మాకు భయపడే ఆర్టీసీ విలీనం :

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టారని గుర్తుచేశారు. 2023 -24లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడబెట్టిన ఆర్టీసీ ఆస్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తామని, ఆర్టీసీ ఆస్తుల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Read More : కేసీఆర్ అంతా కఠిన హృదయం ఉన్న సీఎంను ఇప్పటివరకు చూడలే: రేవంత్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed