TSPSC కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ అని మరోసారి తేలిపోయింది.. వైఎస్ షర్మిల

by Javid Pasha |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ అని మరోసారి తేలిపోయిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అయినవాళ్లకు పదవులు కట్టబెట్టి, కొలువులు అమ్ముకోవడమే కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ అని అన్నారు. టీఎస్పీఎస్సీ చట్టబద్ధ సంస్థ అని చెప్పే చిన్న దొర కేటీఆర్.. చట్టానికి విరుద్ధంగా పదవులు ఎందుకు కట్టబెట్టినట్టు? నిరుద్యోగుల ప్రాణాలు పోతున్నా.. అర్హత, సామర్థ్యం లేని వ్యక్తులను సభ్యులుగా ఎందుకు నియమించినట్టు అని ప్రశ్నించారు. రెండు నెలలుగా దర్యాప్తు పేరుతో ఊగిసలాడుతున్న సిట్.. సభ్యుల నియామకం అక్రమం అని హైకోర్టు చెప్పే దాకా ఎందుకు తేల్చలేదని నిలదీశారు. దొంగలకే తాళాలు ఇచ్చినట్టు మళ్లీ కొలువులు అమ్ముకోవడమే కేటీఆర్, కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరకుండా సిట్ తో అంతా సెట్ చేస్తున్నారని, కేసీఆర్ ను, కేటీఆర్ ను విచారిస్తేనే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు.

ప్రశ్నాపత్రాల కుంభకోణంలో ఇప్పటి వరకు అసలు దొంగలను పట్టుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘‘ఇది చాలదు అన్నట్లుగా దొర గారి అనుయాయులకు దరఖాస్తులు లేకుండా పదవులు కట్టబెట్టి, ఉన్న ఉద్యోగాలు మళ్లీ అంగట్లో పెడుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే యువతలో టీఎస్పీఎస్సీ విశ్వసనీయత కోల్పోయింది. మీ సర్కారుపైనా విశ్వాసం లేదు’’ అని షర్మిల అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టుగా కూడా లేదని, ఇకనైనా హైకోర్టు సూచనల మేరకు టీఎస్పీఎస్సీని పూర్తిగా పునరుద్ధరించి, చట్ట ప్రకారం సభ్యులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ యువతకు క్షమాపణ చెప్పి, బిశ్వాల్ కమిటీ సూచించిన లక్షా 91 వేల ఉద్యోగాలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల ప్రాణాలను, భవిష్యత్తును కాపాడాలని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed