‘‘ముందు అది మీ నాన్నను ఒప్పించు’’.. కవిత లేఖపై YS షర్మిల సెటైరికల్ రిప్లే..!

by Satheesh |   ( Updated:2023-09-06 12:20:39.0  )
‘‘ముందు అది మీ నాన్నను ఒప్పించు’’.. కవిత లేఖపై YS షర్మిల సెటైరికల్ రిప్లే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్ వేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంశాన్ని ముందు మీ తండ్రిని ఒప్పించుకోవాలని.. ఆ తర్వాతే ఇతర పక్షాల మద్దతు కోరాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కవిత లేఖకు సమాధానంగా బుధవారం రెండు పేజీలతో కూడిన లెటర్‌ను విడుదల చేసిన షర్మిల.. తెలంగాణ అసెంబ్లీలో మహిళలకు కేవలం 5 శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. సాక్షాత్తు తన తండ్రి సీఎంగా ఉన్న చోటనే ఇంత తేడా ఎందుకు ఉందని ప్రశ్నించారు.

2014 ఎన్నికల సమయంలో కేవలం ఆరుగురు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తే.. 2018 ఎన్నికలప్పుడు కేవలం నలుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కవిత తెలంగాణలో మహిళలకు న్యాయం జరిగేలా ముందు తన తండ్రి కేసీఆర్‌ను ఒప్పించాలని సూచించారు. 'మీరు చూడాలి అనుకుంటున్న మార్పు మీ నుంచే మొదలు పెట్టండి' అని మహాత్మ గాంధీ చెప్పినట్లు మహిళా రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ను ఒప్పించాలని ఆ తర్వాత దేశానికి ఓ దిక్సూచిగా నిలవాలని సూచించారు.

బీఆర్ఎస్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 5 శాతం సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. అందువల్ల మహిళా రిజర్వేషన్ బిల్లుపై నా అభిప్రాయంతో పాటు ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను మీకు పంపుతున్నాననని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ జాబితా ప్రకారం బీఆర్ఎస్ సీట్లలో మహిళలకు 33 శాతం ఇచ్చారా లేదా లెక్కబెట్టుకోవాలని ఇందుకోసం ఒక ఆన్ లైన్ కాలిక్యులేటర్ లింకును కూడా పంపుతున్నానని షర్మిల తన రిప్లేలో సెటైర్ వేశారు.

Advertisement

Next Story