BRS అంటే ‘భూములమ్మే రాష్ట్ర సమితి’: మరో కొత్త పేరుపెట్టిన షర్మిల

by Satheesh |   ( Updated:2023-08-05 14:38:21.0  )
BRS అంటే ‘భూములమ్మే రాష్ట్ర సమితి’: మరో కొత్త పేరుపెట్టిన షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వరాష్ట్రంలో సర్కారీ భూములపై చేస్తున్న దందాకు పొంతనే లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ పని కాకుంటే మీ 9 ఏళ్ల పాలనలో 38 వేల ఎకరాలు ఎందుకు అమ్మారని వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. చిన్న దొర చెప్పేవి శ్రీ రంగ నీతులు.. చేసేవి పనికి మాలిన పనులని విమర్శించారు. భూములు అమ్మొద్దని ఉద్యమంలో చెప్పిన ఊకదంపుడు మాటలకు.. వెతికి మరీ ఫర్ సేల్ బోర్డులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

మరో 50 వేల ఎకరాలు అమ్మేందుకు కసరత్తు ఎందుకు చేస్తున్నట్లు..? తెచ్చిన అప్పులు కమీషన్ల కింద.. రాష్ట్ర ఆమ్దానీ విలాసాల కింద ఖర్చు పెడుతున్న రాబందులకు, భూములు అమ్మకపోతే పొద్దు గడవదని ధ్వజమెత్తారు. అందుకే బీఆర్‌ఎస్ అంటే ‘భూములమ్మే రాష్ట్ర సమితి’ అని ఆమె ఘాటుగా విమర్శించారు. సర్కారీ భూములు మింగేసే ‘భూ భకాసుర రాష్ట్ర సమితి’ అని.. భవిష్యత్ అవసరాలకు భూములు లేకుండా కొల్లగొట్టే విధంగా కేసీఆర్ ప్లాన్ వేశారని ఆరోపించారు. బందిపోట్లకు బుద్ధి చెప్పకపోతే రేపు రాష్ట్రాన్ని సైతం వేలం వెయ్యక మానరని మండిపడ్డారు.

Advertisement

Next Story