Tammineni : 21న లగచర్లకు వామపక్ష బృందం : తమ్మినేని

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-19 12:31:13.0  )
Tammineni : 21న లగచర్లకు వామపక్ష బృందం : తమ్మినేని
X

దిశ, వెబ్ డెస్క్ : వామపక్ష నేతల బృందం(Left team) ఈ నెల 21న లగచర్ల(Lagacharla)బాధిత రైతులను కలుస్తుందని, మమ్మల్ని అక్కడికి వెళ్లనీయకుంటే లగచర్లకే పరిమితమైన ఈ సమస్యను రాష్ట్ర సమస్యగా మారుస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram)ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 21న లగచర్లకు వెళ్లి బాధిత రైతాంగాన్ని కలిసి వాస్తవ పరిస్థితులను పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరతామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. భౌతిక దాడి పరిష్కారం కాదని, అయితే ఘటన తర్వాతైనా సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని సూచించారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని లగచర్ల పరిసర గ్రామాల్లో నిర్బందాన్ని ప్రయోగించడం, ఇంటర్నెట్ బంద్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి బీఆర్ఎస్ కు చెందిన వారినే జైలుకు పంపించారని ఆరోపించారు. ఎవరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనివ్వకుండా ఎందుకంత నిర్బంధమని, నిర్బంధ చర్యలను ప్రభుత్వం వెంటనే అపాలని డిమాండ్ చేశారు. గ్రామాలనే జైళ్లలాగా మార్చారనీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని కోరారు. సమస్యను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించాలని సూచించారు. లగచర్ల దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందా? లేదా? అనే అంశంపై పరిశీలించాల్సి ఉందన్నారు.

వికారాబాద్ జిల్లాలో ఫార్మా సంస్థ కోసం 1,375 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, అందులో 600 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందనీ, మిగతాది రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించిందని తమ్మినేని వెల్లడించారు. ఇందుకు ప్రజాస్వామ్య పద్దతిని పాటించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం సరైంది కాదన్నారు. ఇబ్రహీంపట్నంలో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 15 వేల ఎకరాలను సేకరించిందని, అప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫార్మా సిటీని రద్దు చేస్తామనీ, ఆ భూములను రైతులకు తిరిగి ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఇంకా ఆ భూమిని రైతులకివ్వలేదని విమర్శించారు. ఇప్పుడు ఫార్మాసిటీకి చెందిన 15 వేల ఎకరాలకు మరో 15 వేల ఎకరాలు కలిపి మొత్తం 30 వేల ఎకరాల్లో ఫోర్తు సిటీని నిర్మిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, విదేశీ సంస్థలకు ఆ భూములను కట్టబెట్టడం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, రామగుండం రాడార్ స్టేషన్ ఏర్పాటు, గ్రూప్-1 వివాదం, ఫార్మాసిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవడం లేదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని, ఇది ఏ రకమైన ప్రజాస్వామమో సీఎం రేవంత్ రెడ్ది ఆలోచించుకోవాలన్నారు. భూసేకరణ కోసం 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందన్నారు. అది రైతులను దోపిడీ చేయడమేనని, ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.50 లక్షలుంటే, ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తే ఎలా? అని ప్రశ్నించారు. మూసీ పరిధిలోనూ బాధిత ప్రజలకు నష్టపరిహారం, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన తర్వాతే పేదల ఇండ్లను కూల్చివేత చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు.

Advertisement

Next Story