కేసీఆర్ ఒక్క స్విచ్ ఆన్ చేస్తే పాలమూరు పచ్చబడ్డదా..? సీఎంపై YS షర్మిల తీవ్ర విమర్శలు

by Satheesh |
కేసీఆర్ ఒక్క స్విచ్ ఆన్ చేస్తే పాలమూరు పచ్చబడ్డదా..? సీఎంపై YS షర్మిల తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 31 మోటార్లకు ఒక్కటి పూర్తి చేసి దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ డప్పు కొట్టుకుంటున్నారని, ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరమైనా తడిచిందా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. పాలమూరు ప్రజలు ఎప్పుడూ కృష్ణా జలాలను చూడనే లేదన్నట్లు, పాలమూరు రైతులు వ్యవసాయమే చేయలేదన్నట్లు కేసీఆర్ కాకమ్మ కథలు చెబుతున్నారని ఆమె శనివారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రారంభించిన మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమని, మొదలుపెట్టి 8 ఏళ్లయినా కేసీఆర్‌కు పూర్తి చేయడం చేతకాలేదని ఆమె విరుచుకుపడ్డారు.

తన తండ్రి వైఎస్సార్ రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసం రూ.52 వేల కోట్లకు పెంచేశారని, ఏళ్ల తరబడి కమీషన్లు తిన్నారే తప్ప ప్రాజెక్టు పూర్తి చేసింది లేదని ఆమె దుయ్యబట్టారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా పూర్తికాలేదని, ప్రాజెక్టు పరిధిలో ఉన్న 4 రిజర్వాయర్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. లక్ష్మీదేవిపల్లి 6వ రిజర్వాయర్‌కు టెండర్లు కూడా పిలవలేదని షర్మిల విమర్శలు చేశారు.

కేవలం అంజనాపూర్ మొదటి రిజర్వాయర్‌లో 90 శాతం పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్ మొత్తం కట్టినట్లు డబ్బా కొట్టుకుంటున్నాడని ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గ్రహించి.. పాలమూరులో 14 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావన్న సర్వే రిపోర్టులతో బెంబేలెత్తిపోయి సగం కూడా పూర్తి కాని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక్క మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించినట్లు కలరింగ్ ఇచ్చి రాజకీయానికి వాడుకున్నారని కేసీఆర్‌పై షర్మిల విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed