Siddique: ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు ?.. సిద్ధిఖీ బెయిల్ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

by Shamantha N |
Siddique: ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు ?.. సిద్ధిఖీ బెయిల్ కేసులో సుప్రీం వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రేప్ కేసులో నిందితుడిగా ఉన్న మలయాళ నటుడు సిద్ధిఖీకి (actor Siddique) సుప్రీంకోర్టులో(Supreme Court) భారీ ఊరట లభించింది. ఆయనకు జస్టిస్‌ బేలా త్రివేది, సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో సిద్ధిఖీపై ఫిర్యాదు చేయడానికి ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు అయిందని కోర్టు ప్రశ్నించింది. ఈ కారణంతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సిద్ధిఖీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సిద్ధిఖీ ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారు అభియోగాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇకపోతే, ఈ కేసులో సిద్ధిఖీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసుల విచారణకు సిద్ధిఖీ సహకరించాలని సూచించింది. తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్‌ కోర్టులో డిపాజిట్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు, ఫిర్యాదు విషయంలో ఆలస్యానికి బాధితురాలి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ ఇలా మాట్లాడారు. హేమా కమిటీ నివేదికను విడుదల చేయడం ఆపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి ధైర్యం వచ్చిందని వారు అన్నారు.

అసలు కేసు ఏంటంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో(Malayalam film industry) నటీమణులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని జస్టిస్‌ హేమ కమిటీ చేసిన రిపోర్ట్‌లో తేలింది. ఈ క్రమంలో కొందరు పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. 2016లో మలయాళ నటి చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ముందుగా ఒక సినిమాలో ఛాన్స్‌ ఇస్తానని ఫేస్‌బుక్‌ ద్వారా తనకు సిద్ధిఖీ పరిచయం అయ్యాడని, ఆపై తన కోరికను తీర్చాలని బలవంతం చేసినట్లు పేర్కొంది. అందుకు తాను నిరాకరించడంతో ఒక పథకం ప్రకారం తనను హోటల్‌కు రప్పించి సిద్ధిఖీ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నటి ఆరోపించింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed