Hemant Soren: అసత్య ప్రచారానికి 9 వేల వాట్సప్ గ్రూప్స్.. రూ.500 కోట్లు ఖర్చు..బీజేపీపై సోరెన్ విమర్శలు

by Shamantha N |
Hemant Soren: అసత్య ప్రచారానికి 9 వేల వాట్సప్ గ్రూప్స్.. రూ.500 కోట్లు ఖర్చు..బీజేపీపై సోరెన్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు యత్నిస్తుందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) విమర్శలు గుప్పించారు. తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందంటూ ఆరోపించారు. ప్రజల్లో తనపై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని అందుకు ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తనపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎక్స్‌ వేదికగా స్పందించారు. అలాగే, జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వం గురించి అసత్య ప్రచారం చేసేందుకు 9 వేలకు పైగా వాట్సప్‌ గ్రూప్‌లను సృష్టించిందన్నారు. కానీ, తాను జార్ఖండ్‌ బిడ్డని అని.. ఈ గడ్డపై ఇలాంటి సంస్కృతికి తావు లేదని పిలుపునిచ్చారు. అలాంటి పనులు ఎప్పటికీ చేయలేనని సీఎం హేమంత్‌ సోరెన్‌ చెప్పుకొచ్చారు.

బీజేపీపై మండిపాటు

ఇక, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి కొందరిని ప్రచారానికి కాషాయం పార్టీ తీసుకొచ్చిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడించి.. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు స్కెచ్ వేస్తుందన్నారు. అందుకోసం ఒక్క నియోజకవర్గంలోనే రూ.కోటికి పైగా ఖర్చు పెట్టందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎన్నికల ప్రచారం చేయకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల బాండ్లు, నకిలీ ఔషధాలు, నకిలీ వాక్సిన్లతో తాము ప్రజల జీవితాలతో ఆడుకోలేదని భారతీయ జనతా పార్టీపై సోరెన్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed