మొన్న మల్లారెడ్డి.. నేడు రోహిత్ రెడ్డి! తలనొప్పిగా ఆ వివాదం

by Sathputhe Rajesh |
మొన్న మల్లారెడ్డి.. నేడు రోహిత్ రెడ్డి! తలనొప్పిగా ఆ వివాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్యేల వాహనాలకు కేటాయించే స్టిక్కర్లపై వివాదం చెలరేగుతోంది. వరుసగా ఎమ్మెల్యేల స్టిక్కర్లు వివాదాస్పద వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం దుమారం రేపుతోంది. మొన్న మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన స్టిక్కర్ వివాదాస్పదం కాగా తాజాగా మైలార్ దేవులపల్లి శాస్త్రిపురంలో వెలుగు చూసిన ప్రభుత్వ భూకబ్జా వ్యవహారంలో కబ్జాకోరుల కారుపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ స్టిక్కర్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. దీంతో భూకబ్జాకు ప్రయత్నించింది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మనుషులేనా? అసలు ఆ కార్లు ఎవరివి? ఒక వేళ ఆ కార్లు రోహిత్ రెడ్డివి కాకపోతే ఆ స్టిక్కర్లు ఆ కార్లపైకి ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఈ అంశంపై స్పందించిన పైలెట్ రోహిత్ రెడ్డి ఈ భూ కబ్జా వ్యవహారంతో తనకు సంబంధం లేని స్పష్టం చేశారు. ఆ స్టిక్కర్ల వ్యవహారం కూడా తాను మీడియాలో చూసి తెలుసుకున్నానని వాటితోనూ తనకు సంబంధం లేదని తేల్చారు. పాత స్టిక్కర్లు వారి వద్దకు ఎలా చేరాయనేది తాను ఆరా తీస్తున్నానని, అలాగే స్టిక్కర్లు వాడిన వారిని గుర్తించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే స్టిక్కర్లపై వరుసగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఏడాది క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు కేటాయించిన ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగి ఉన్న ఓ కారు బంజారాహిల్స్ రోడ్డుపై బీభత్సం సృష్టించింది.

ఈ కారు ఓ మహిళను ఢీ కొట్టడంతో మహిళ చేతిలో ఉన్న పాప ప్రాణాలు కోల్పోయింది. మరో వైపు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యాపార భాగస్వామిగా చెప్పబడుతున్న బోయినపల్లి మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డికి చెందిన స్టిక్కర్లు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. ఆ సమయంలో మంత్రి స్పందిస్తూ తానే పడేసిన ఆ స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం అని ఎదురు ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ఈ తరహా వ్యవహారం అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో మరో సారి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్లను ఏకంగా భూ కబ్జాదారులు తమ వాహనాలపై ఉపయోగించడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ఎమ్మెల్యేలకు ప్రభుత్వం కేటాయిస్తున్న స్టిక్కర్ల విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారా లేక ఉద్దేశపూర్వకంగానే ఇతరుల చేతికి అందజేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు పేరుతో హడావుడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం మామూలు విషయంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఎమ్మెల్యేలు తమకు ప్రభుత్వం కేటాయించిన స్టిక్కర్ల విషయంలో జాగ్రత్త వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story