బీఆర్కే భవన్‌ను కూల్చేస్తారా? ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

by Sathputhe Rajesh |
బీఆర్కే భవన్‌ను కూల్చేస్తారా? ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్కే బిల్డింగ్ భవిష్యత్ ఏంటీ? సెక్రటేరియట్ ఓపెనింగ్ తర్వాత ఏం చేస్తారు? ఏ అవసరాల కోసం ఉపయోగిస్తారు? ఇతర ఆఫీసులకు కేటాయిస్తారా? దానిని ఏం చేయబోతున్నారు? అనే చర్చ కొనసాగుతున్నది. ఈ నెల 30న కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈలోపే బీఆర్కే బిల్డింగ్‌లో ఉన్న డిపార్ట్‌మెంట్స్ అన్నింటినీ షిఫ్ట్ చేయనున్నారు. ఆ తర్వాత బీఆర్కే బిల్డింగ్‌ను ఏంచేస్తారు? అనే ఆసక్తి నెలకొంది.

కూల్చివేసి పార్క్ నిర్మాణం?

కొత్త సెక్రటేరియట్ వ్యూ కేవలం ట్యాంక్‌బండ్ మీదుగా వస్తున్న ప్రజలకు మాత్రమే కనిపిస్తున్నది. లిబర్టీ నుంచి వచ్చే వారికి కనిపించదు. ఎందుకంటే 9 అంతస్తులో నిర్మించిన బీఆర్కే బిల్డింగ్ అడ్డుగా ఉండడమే ఇందుకు కారణం. కొత్త సెక్రటేరియట్ కనిపించాలంటే బీఆర్కే బిల్డింగ్‌ను కూల్చడమే పరిష్కారం అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. బీఆర్కే ప్రాంతం మొత్తం ఖాళీగా ఉంచే బదులు అక్కడ పార్క్ నిర్మించాలనే చర్చ వచ్చినట్టు తెలిసింది.

విశాలమైన పార్క్ నిర్మిస్తే సాయంత్రం ట్యాంక్‌బండ్ పరిసరాలతో పాటు ఇక్కడ సిటీ ప్రజలు సేద తీరేందుకు అవకాశం ఉంటుందని, కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ఇటీవల నిర్వహించిన రివ్యూలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అందుకే ఆ బిల్డింగ్‌ను ఏ ప్రభుత్వ శాఖలకు కేటాయించకుండా ఖాళీగా ఉంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

మళ్లీ పవర్‌లోకి రాగానే యాక్షన్ ప్లాన్

సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్కే బిల్డింగ్‌ను కూల్చడంపై ఫోకస్ పెడుతారని చర్చ సాగుతున్నది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో బిల్డింగ్ కూల్చివేస్తే విమర్శలు వస్తాయని కారణంతో నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఈలోపు ప్రస్తుతం కొత్త సెక్రటేరియట్‌కు బీఆర్కే పక్కన ఉన్న రోడ్డు వీధిపోటు సమస్యగా ఉండడంతో దాన్ని పరిష్కరించేందుకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.

మాకు ఇవ్వండి : ఎన్నికల సంఘం

బీఆర్కే బిల్డింగ్ ఖాళీ అయిన తర్వాత తమకు కేటాయించాలని ఎన్నికల సంఘం కోరుతున్నది. 8, 9 ఫ్లోర్లను తమకు ఇవ్వాలని ఆరు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం బుద్దభవన్ కేంద్రంగా ఈసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడ సరైన స్పేస్ లేదని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నది. మరో పక్షం రోజుల్లో బీఆర్కే భవన్ ఖాళీ అవుతున్నందున ఆ బిల్డింగ్‌ను ఈసీకి ఇవ్వడంపై ప్రభుత్వం స్పందించడం లేదని సమాచారం.

Advertisement

Next Story