- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన రద్దు వెనుక హస్తమెవరిది?
దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఢిల్లీకి రావాల్సిందిగా సోమవారం కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు వెళ్లింది. పుదుచ్చేరి పర్యటనను ముగించుకున్న ఆమె హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి 9.20 గంటలకు ఇండిగో (6ఈ-6684) విమానం ద్వారా ఆమె ఢిల్లీకి వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ నుంచి సమాచారం వచ్చింది. ఆమె పర్యటన అర్ధంతరంగా రద్దయింది. ఎందుకు రద్దయిందనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగానే గవర్నర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీటింగ్‌ను ఫిక్స్ చేయడం, చివరి నిమిషాల్లో రద్దు కావడంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి గవర్నర్‌కు పిలుపు రావడంపై రకరకాల చర్చలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఒకవైపు పబ్‌లో డ్రగ్స్ పట్టుబడినట్లు వార్తలు రావడంతో కేంద్రం ఒకింత అప్రమత్తమైంది. ఈ వివరాలను గవర్నర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనికి తోడు గత కొంతకాలంగా గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. గ్యాప్ పెరిగింది నిజమేనని, అందుకు కారణాలు మాత్రం తనవైపు నుంచి కాదంటూ గవర్నర్ ఈ నెల 1న ఉగాది వేడుకల సందర్భంగా మీడియాకు వివరించారు. ఇటీవల కాలంలో ప్రోటోకాల్ వివాదాలు చోటుచేసుకున్నట్లు ఆమె స్వయంగా పేర్కొన్నా.. వాటిని తాను పట్టించుకోలేదని వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి రావాల్సిందిగా గవర్నర్‌కు పిలుపు రావడంతో ఈ అంశాలన్నింటిపై కేంద్ర హోం మంత్రికి వివరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అక్కడ ఉండగానే గవర్నర్‌తో కేంద్ర హోం మంత్రి మీటింగును ఏర్పాటు చేయడం ఆసక్తికర చర్చలకు దారితీసింది. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగి బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో మీటింగును రద్దుచేస్తూ హోంశాఖ నుంచి సమాచారం వచ్చింది. రద్దు వెనక కారణాలేమై ఉంటాయి.? అనే సరికొత్త చర్చలు మొదలయ్యాయి. ఎవరి ప్రమేయంతో ఈ మీటింగు రద్దయింది, నిర్దిష్టంగా కారణాలేంటి అనేవి సమాధానం లేని సందేహాలుగానే మిగిలిపోయాయి.హోంశాఖ నుంచి తొలుత అందిన సమాచారం ప్రకారం నార్త్ బ్లాక్‌లో హోం మంత్రితో మంగళవారం ఉదయం గవర్నర్ భేటీ కావాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతానికి రద్దు కావడంతో తిరిగి ఈ మీటింగు ఎప్పుడు ఉంటుందనేది రాజ్‌భవన్ వర్గాలకు కూడా నిర్దిష్టంగా సమాచారం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉన్నది. ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ పర్యటన ఉండొచ్చని సమాచారం.