- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడ్లు కొనుగోలు.. అసలు కేంద్రంతో తెలంగాణ ఒప్పందం ఏంటి?
ముడిబియ్యం సరఫరా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగా వెల్లడించింది. రా రైస్ తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..పంజాబ్ తరహాలోనే తెలంగాణ నుంచీ తీసుకుంటాం.. టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి- పీయూష్ గోయల్, కేంద్రమంత్రి
మద్దతు ధర వడ్లకే తప్ప బియ్యానికి కాదు.. మా రైతుల వడ్లన్నీ కొనండి.. పైసలివ్వండి.. ఆ వడ్లను ముడిబియ్యం చేసుకుంటారా.. ఉప్పుడు బియ్యం చేసుకుంటారా.. మీ ఇష్టం.. ధాన్యం కొనకుంటే ఊరుకునేది లేదు. పంజాబ్ విధానమే మాకూ అమలు కావాలె- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
వడ్ల కొనుగోళ్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ఏంటి..? ఆ ఒప్పందంలో ఏముంది..? తెలంగాణ ప్రభుత్వం ఏ కండిషన్లకు సిద్ధమైంది. ఇరు పార్టీల మధ్య గల్లీ నుంచి ఢిల్లీ దాక రచ్చకు దారి తీసిన ఆ అగ్రిమెంట్ లో ఏం రాశారు. ఎందుకు రాసిచ్చారు..? అనే చర్చ రాష్ట్రంలో నడుస్తున్నది.. ఇంతకు ఆ ఒప్పంద పత్రం ఎవరు ఎవరికి రాసిచ్చారు.. అందులో ఏముందో ఓ సారి చూద్దాం..
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందమే ఇప్పుడు గుదిబండగా మారింది. భవిష్యత్తులో ఎప్పటికీ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ గతేడాది రాష్ట్రం అగ్రిమెంట్ చేసింది. ఇప్పుడు దాన్నే ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలంటూ షరతు పెడుతున్నది. తెలంగాణలో యాసంగి సీజన్‌లో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. ఒప్పందానికి భిన్నంగా కొనలేమంటూ కేంద్రం మొండికేస్తున్నది. ఒప్పందానికి కట్టుబడి ఉండలేక రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తే దాన్ని ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం సతమతమవుతున్నది. కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వెనక్కు రావడానికి దారి లేకుండా పోయింది. దాన్ని అమలు చేయాలంటే విధిగా పచ్చి బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ యాసంగి సీజన్ వడ్లు బాయిల్డ్ రైస్‌కు మాత్రమే సరిపోతాయని, పచ్చి బియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలుగా మారి నష్టం ఎక్కువగా వస్తుందన్నది మంత్రుల, పౌరసరఫరాల శాఖ అధికారుల ఆందోళన. దీంతో వడ్లను మాత్రమే కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. బాయిల్డ్ రైస్‌గా మార్చుకుంటరా.. లేక బాగోతం ఆడుకుంటరా .. మీ ఇష్టం అంటూ సీఎం కేసీఆర్ సైతం వ్యాఖ్యానించారు. ఒప్పందానికి భిన్నంగా వడ్లను కొనే అవకాశమే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రైతులు పండించిన ధాన్య సేకరణకు ప్రత్యామ్నాయం తెలియక రాష్ట్రం మల్లగుల్లాలు పడుతున్నది.
రాష్ట్రానికి గతేడాదే క్లారిటీ ఉన్నది
నిజానికి గతేడాది వానాకాలం సీజన్‌లోనే ధాన్య సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ మొదలైంది. వానాకాలం సీజన్‌లో కేవలం 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తెలంగాణ నుంచి కొంటామని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కానీ దిగుబడి గణనీయంగా పెరగడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు సరిపోగా మిగిలిన ఉత్పత్తినీ కొనాలంటూ కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. 'వన్ టైమ్' సెటిల్‌మెంట్‌లో భాగంగా అదనంగా మరో 20 లక్షల టన్నుల బియ్యాన్ని కూడా కొననున్నట్లు కేంద్రం హామీ ఇచ్చింది. ఇందుకోసం కొన్ని షరతులను కూడా పెట్టింది. వానాకాలం తరహాలోనే యాసంగి సీజన్‌లోనూ ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుందని కేంద్రం ముందుగానే అనుమానించింది కాబోలు... రాతపూర్వకంగానే తెలంగాణ ప్రభుత్వంతో ఎఫ్‌సీఐ ఒప్పందం కుదర్చుకున్నది. బాయిల్డ్ రైస్ కొనడానికి ఎఫ్‌సీఐ ససేమిరా చెప్పింది. 2021-22 యాసంగి సీజన్ నుంచి పారా బాయిల్డ్ రైస్ ఒక్క గింజ కూడా కొనలేమని చెప్పింది. పచ్చి బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. ఈ పరిస్థితులతో రాష్ట్రానికి ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యామ్నాయాలనూ సూచించింది. ఆ రాతపూర్వక ఒప్పందంలో ఆరు అంశాల (నిబంధనల)ను ఎఫ్‌సీఐ స్పష్టంగా పేర్కొన్నది. గతేడాది అక్టోబరు 4న తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్‌సీఐ తరఫున హైదరాబాద్ రీజినల్ జనరల్ మేనేజర్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
ఒప్పందంలో తెలంగాణ ఇచ్చిన హామీలేంటి?
• భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి తెలంగాణ పారా బాయిల్డ్ రైస్ సరఫరా చేయదు.
• రాష్ట్రంలో రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి కోసం పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుంటుంది.
• బియ్యానికి కొన్ని రకాల పోషకాలను చేర్చి ఫోర్టిఫైడ్ రైస్‌గా మారుస్తుంది. ఇందుకు తగిన చొరవ తీసుకుంటుంది. రైస్ మిల్లులకు అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి సరిపయేలా మిల్లుల సామర్థ్యాన్ని పెంచుతుంది. రాష్ట్ర ప్రజల అవసరాలకు మాత్రమే కాక ఎఫ్‌సీఐకు కూడా సరఫరా చేస్తుంది.
• 2020-21 సంవత్సరంలో ధాన్య సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలకు, క్షేత్రస్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ సందర్భంగా కొన్ని తేడాలు చోటుచేసుకున్నాయి. ఇకపైన ఇలాంటివి పునరావృతం కాకుండా నిల్వలు ఏ మేరకు ఉన్నాయో రిజిస్టర్ల నిర్వహణను కేంద్ర ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా చేపడతాం.
• ధాన్య సేకరణ గణాంకాలను పకడ్బందీగా నిర్వహించేందుకుగాను భూముల రికార్డులను, ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తాం. 2021 అక్టోబరు 10 నుంచే ధాన్య సేకరణకు తప్పనిసరిగా పాటించాల్సిన ప్రమాణాలను (థ్రెషోల్డ్ పారామీటర్స్) అమలుచేస్తాం.
ఈ నిబంధనలన్నింటినీ ఒప్పందంలో పేర్కొని తెలంగాణ ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంతకం చేశారు. తెలంగాణ నుంచి 2020-21 సంవత్సరానికిగాను రబీ సీజన్‌కు 44.75 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్‌ను కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఒప్పందంపైనే కేంద్రం పట్టు
తెలంగాణ స్వయంగా ఒప్పందాన్ని కుదుర్చుకుని సంతకం కూడా చేసి నిబంధనలను అంగీకరించినందున ఇప్పుడు వడ్లనే కొనాలని, పారాబాయిల్డ్ రైస్ కూడా కొనాలని ఒత్తిడి తేవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పడుతున్నది. ఒప్పందాన్నే తాము ప్రామాణికంగా తీసుకుంటామని, ఇది అమల్లో ఉండగా ఇతర విధానాలను పాటించలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం నొక్కిచెప్తున్నారు. ముడి (పచ్చి) బియ్యాన్ని ఎంత మోతాదులో ఇచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. పారా బాయిల్డ్ రైస్ మాత్రం ఒప్పందంలో తెలంగాణ పేర్కొన్నట్లుగానే నడుచుకోవాలని హితవు పలికారు. ఒత్తిడి పనిచేయదని, ఒప్పందమే ఫైనల్ అని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం నుంచి ధాన్యాన్ని ఎవరు కొంటున్నారో రైతులకు అవగతమైంది. ప్రస్తుత యాసంగి ధాన్యం విషయంలో రైతులు కన్విన్స్ చేయడం, వారికి నష్టం రాకుండా చూడడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.